
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ప్రజాప్రతినిధులు
శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో ఏర్పాట్లు
8న వినుకొండలో సీఎం బస్సు యాత్ర
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
శావల్యాపురం: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 9న సీఎం ఉగాది సంబరాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వినుకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ మేరకు శావల్యాపురం మండలం వేల్పూరు శివారు గంటావారిపాలెంలో ఉగాది వేడుకల ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు.
ఈ నెల 8న సీఎం వైఎస్ జగన్ వినుకొండ, విఠంరాజుపల్లె, కనమర్లపూడి, శావల్యాపురం, కృష్ణాపురం, గంటావారిపాలెం గ్రామాల పరిధిలో పర్యటిస్తారన్నారు. అదేరోజు రాత్రి గంటావారిపాలెంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో బస చేస్తారని బ్రహ్మనాయుడు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సుహాసిని అనిల్‌కుమార్, ఈపూరు మార్కెట్ యార్డు చైర్మన్ చుండూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా సీఎం వైఎస్ జగన్ బస చేయనున్న ప్రాంగణాన్ని నరసరావుపేట డీఎస్పీ వత్సవాయి సత్యనారాయణవర్మ, సీఐలు ఉప్పుటూరి సుధాకర్, యం. సాంబశివరావు, ఎస్సై చల్లా సురేష్ పరిశీలించారు.