
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): కేవలం 20 నుంచి 30 ఎమ్మెల్యే సీట్లకోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. చంద్రబాబు బూట్లు నాకుతున్నాడని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ దుయ్యబట్టారు. ఇందుకోసమే ఆయనతోపాటు ఆయన సామాజికవర్గాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టాడని ధ్వజమెత్తారు. విశాఖలో తనపై పవన్‌కళ్యాణ్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఆదివారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని తన కార్యాలయంలో ఎంపీ విలేకరులతో మాట్లాడారు. తనను రాజీనామా చేయమనే నైతికహక్కు పవన్‌కు లేదన్నారు.
కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. పవన్ రాష్ట్రంపై కనీస అవగాహన, విజ్ఞానం, నైతికత, కుటుంబ విలువలు, కనీసం మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎంపీగా తనను ఎందుకు గెలిపించారని అడుగుతున్న పవన్‌కళ్యాణ్ ఏరోజైనా గాజువాక ప్రజలు ఆయన్ని ఎందుకు ఓడించారో అడిగారా అని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచిన నాటి నుంచి విశాఖలోనే ఉన్నానన్నారు. గాజువాకలో ఓడిపోయిన తర్వాత పవన్ ఎప్పుడైనా ఆ నియోజకవర్గ ప్రజల వైపు చూశారా.. అని నిలదీశారు. అక్రమ వ్యాపారంతో విశాఖను నాశనం చేస్తున్నానంటూ తనపై చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. సినిమాల ద్వారా ఆయన వ్యాపారం చేయడం లేదా.. అని ప్రశ్నించారు.
సీబీసీఎన్‌సీ భూముల టీడీఆర్‌పై కనీస అవగాహన లేదు
సీబీసీఎన్‌సీ భూముల టీడీఆర్‌పై కనీసం అవగాహన లేకుండా దున్నపోతు మాదిరిగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. ఆ ప్రాజెక్టు నిబంధనలకు అనుగుణంగానే చేపట్టినట్లు తెలిపారు. సొంత కులాన్ని చంద్రబాబుకి తాకట్టుపెట్టిన పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆ కులానికి ఏం మేలు చేశాడో చెప్పాలన్నారు. పవన్‌కళ్యాణ్‌కు నిజంగా సత్తా ఉంటే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను పోటీచేయించాలని సూచించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు.
తన కుటుంబసభ్యుల కిడ్నాప్ కేసుపై పవన్ వ్యాఖ్యలను ఎంపీ కొట్టిపడేశారు. నేరస్తులపై చర్యలు తీసుకోవడం అంటే.. తాను వెళ్లి వారిని మర్డర్ చేయాలని పవన్ భావిస్తున్నాడా అని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో రాజ్యాంగబద్ధంగా చట్టప్రకారం నేరస్తులపై చర్యలుంటాయని చెప్పారు. వీఐపీ రోడ్డు కూడలి మూసివేత అన్నది నగర మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పోలీసులు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఆ రోడ్డు మూసివేతకు, పక్కనే జరుగుతున్న తమ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ రోడ్డు మూసివేతపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాస్తానని ఎంపీ చెప్పారు.