అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు గైర్హాజరీలో ఆయన బావమరిది బాలకృష్ణ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు.
చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో.. పార్టీ ఏం చేయాలన్నదానిపై విజయవాడలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఈ సాయంత్రం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వం వహించారు. సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాలకృష్ణ.. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.
కిం కర్తవ్యం.?
బాలకృష్ణ నిర్వహించిన ఈ సమావేశానికి సీనియర్లు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్‌రావులతో పాటు పట్టాభి, నక్కా ఆనంద్‌బాబు సహ పలువురు హాజరయ్యారు. చంద్రబాబు జైల్లో ఉండడం, ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియకపోవడంతో పార్టీ తదుపరి కార్యాచరణను బాలకృష్ణ చర్చించినట్టు తెలిసింది.
చంద్రబాబు జైల్లోనే ఉంటే పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై పార్టీ సీనియర్ నేతలతో చర్చలు నిర్వహించారు. పార్టీని ఎవరు ముందుండి నడిపించాలి? పార్టీ వ్యవహారాలు ఎవరు చక్కబెట్టాలన్న అంశాలపై చర్చించారు.
అతిథి పాత్రలో అన్న కుటుంబం
పార్టీ పరంగా ఇప్పటివరకు ఏ వ్యవహారం ఉన్నా... అది కేవలం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగేదంటారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత .. కుటుంబ సభ్యులెవరినీ పార్టీలో పైకి రానివ్వలేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన హరికృష్ణ అయినా, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయినా.. అతిథి పాత్రల్లోనే కనిపించారు. వారిని ఆక్..పాక్..కరివేపాక్.. తరహాలో బాబు వాడుకుని వదిలేశాడు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. కొడుకు పెళ్లితో చుట్టరికం కలుపుకున్నాడు కాబట్టి హిందుపురం వరకు అవకాశం ఇచ్చాడు చంద్రబాబు. పార్టీలో ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా.. దాన్ని తన అదుపులోనే ఉంచుకున్నాడు. ఓటుకు కోట్లు కేసు సందర్భంగా హైదరాబాద్ నుంచి చంద్రబాబు.. కరకట్టకు పారిపోయినప్పుడు.. హైదరాబాద్‌లోని టిడిపి శాసనసభాపక్ష కార్యాలయానికి కూడా ఒకసారి బాలకృష్ణ వచ్చారు.
అయోమయం.. గందరగోళం..
ఇప్పటివరకు పార్టీలో ఏ పనయినా, ఏ మాటయినా చంద్రబాబు నుంచే రావాలి. అయితే చంద్రబాబు ఏ ఒక్కరితో తన మనసులో మాట పంచుకున్నది లేదు. చాలా వ్యవహారాలు అత్యంత రహస్యంగా పూర్తి చేయడంలో బాబు దిట్ట అని పార్టీలో ప్రచారం ఉంది. ఎన్టీఆర్ తర్వాత పార్టీలో ఇప్పటివరకు అసలు ప్రజాస్వామ్యం అన్నదే లేదని, బాబు ఏది చెబితే అదే నడుస్తుందని, ఎవరికి కావాలంటే వాళ్లకు మాత్రమే టికెట్‌లు ఇచ్చుకున్నారని ప్రచారం ఉంది.
ఇక ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న వాదన ఉన్నా.. ఆ విషయంలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఇప్పటివరకు లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని, అనుభవం కూడా అంతంత మాత్రమేనని, పాదయాత్ర చేయడమొక్కటే పూర్తి అర్హత కిందికి రాదన్న వాదన పార్టీ సీనియర్లలో ఉంది. పైగా లోకేష్ తరచుగా నోరు పారేసుకుంటాడని, సరిగా మాట్లాడడం కూడా రాని లోకేష్‌కు పగ్గాలిస్తే.. పార్టీ పరిస్థితి క్లిష్టంగా మారుతుందన్న అభిప్రాయాలున్నాయి. పైగా పాదయాత్రకు బ్రేక్ ప్రకటిస్తున్నానని లోకేష్ ప్రకటించడం మరింత ఇబ్బందికరంగా మారింది. నిజంగా క్లిష్ట సమయంలోనే ప్రజల మధ్య ఉండాలి కానీ పాదయాత్రకు విరామం ప్రకటించడం ఏంటని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు బాబు జైలుకు పరిమితమయ్యారు. అసలు ఇవ్వాళ చంద్రబాబు తరపున బెయిల్ పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఈ విషయంలో తెలుగుదేశం ఏం ఆలోచిస్తుందో బయటకు తెలియని పరిస్థితి. పక్కాగా ఆధారాలున్న ఈ కేసులో ఎప్పుడు బయటకు వస్తాడో తెలియని పరిస్థితి. ఇప్పుడు పార్టీకి ఒక నాయకుడు కావాలి. అది బాలయ్యే ఎందుకు కాకూడదన్నది టిడిపిలో ఓ వర్గం ఆశ. మరి బాలయ్య ఏం చేస్తాడు? అల్లుడి కోసం తప్పుకుంటాడా? లేక అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా నేతృత్వం వహిస్తాడా? కాలమే సమాధానం చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment