సాక్షి, నంద్యాల: స్కిల్ స్కామ్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. సోషల్ మీడియాలో యెల్లో బ్యాచ్ అడ్డగోలుగా రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అయితే దర్యాప్తు క్రమంలో ఇందులో బాబు మద్దతుదారుల కంటే టీడీపీ నేతల పాత్రే ఎక్కువుందని తేటతెల్లమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌గా ధృవీకరించారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్‌కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్. ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది.
మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది ఏపీ హైకోర్టులో. ప్రభుత్వం తరపున ఏపీ శ్రీరామ్ ‘‘ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ జరిగిందని.. జడ్జిలను, వాళ్ల కుటుంబ సభ్యులనూ వదలకుండా ట్రోలింగ్ చేశారని, ఈ క్రమంలోనే అనుచిత పోస్టులు పెట్టార’ని వాదించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్దా వెంకన్నతో పాటు సోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ కానున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ సైతం జడ్జిలపై అనుచిత కామెంట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment