సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. నీట్‌లో మొత్తం 720 మార్కులకు 720 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ పొందిన బోరా వరుణ్ చక్రవర్తి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. 711 మార్కులతో ఆల్ ఇండియా 25వ ర్యాంకర్ వైఎల్ ప్రవర్ధన్ రెడ్డి రెండో స్థానంలో, 38 ర్యాంకర్ వి.హర్షిల్ సాయి మూడో స్థానంలో నిలిచారు.
రాష్ట్రంలో మొదటి పది ర్యాంకులు పొందినవారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నీట్ యూజీకి 69,690 మంది దరఖాస్తు చేసుకోగా, 68,578 మంది పరీక్ష రాశారు. వీరిలో 42,836 మంది అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా 28,471 మంది అమ్మాయిలు, 14,364 మంది అబ్బాయిలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
https:// drysr.uhsap.in వెబ్‌సైట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఉంచారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్విసెస్(డీజీహెచ్‌ఎస్) అందించిన నీట్ అర్హుల వివరాల ఆధారంగా రాష్ట్ర జాబితాను ప్రదర్శించినట్లు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగానే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment