
సాక్షి, అమరావతి : 2024 జనవరి నుంచి విజయవాడలో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శివహర్ష వెల్లడించారు. విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ(ఆర్‌పీవో) అధికారులతో శనివారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం సేవా కేంద్రంగా ఉందని.. గవర్నర్‌పేటలోని ఏజీ ఆఫీస్ కాంప్లెక్స్‌లో వచ్చే జనవరి నుంచి ప్రారంభించే కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం విస్తృత సేవలు అందించనుందని తెలిపారు.
ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయంలోనే పాస్‌పోర్ట్ ప్రింటింగ్ సౌలభ్యం ఉందని, ఇకపై విజయవాడ నూతన కార్యాలయంలోనూ ఈ సేవలు అందుబాటులోకొస్తాయన్నారు. పాస్‌పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్(పరిపాలన), పాల సీ సంబంధిత సేవలనూ విజయవాడ కార్యాలయం అందిస్తుందని తెలిపారు.
దరఖాస్తుదారులకు వేగవంతమైన సేవలు
ఏపీలోని 15 జిల్లాలకు చెందిన పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు విజయవాడ, తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కే), 13 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల(పీఓపీఎస్‌కే) ద్వారా సేవలందిస్తున్నామని, మిగతా జిల్లాలకు విశాఖ ప్రాంతీయ కార్యాలయం సేవలందిస్తుందని చెప్పారు. దరఖాస్తుదారులకు వేగవంతమైన సేవలు అందించడంలో పాస్‌పోర్ట్, పోస్టల్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు.
గతంలో పాస్‌పోర్ట్ స్లాట్ బుకింగ్‌కు నెల పట్టేదని, ప్రస్తుతం ఐదు నుంచి 12 రోజులే పడుతోందన్నారు. విజయవాడ కార్యాలయ పరిధిలో రోజుకు రెండు వేల పాస్‌పోర్ట్ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మూడు లక్షల దరఖాస్తులకు(పాస్‌పోర్ట్‌లు, పోలీసు క్లియరెన్స్) సేవలందించామన్నారు. పాస్ట్‌పోర్ట్ సేవల వినియోగానికి అధికారిక వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని, నకిలీ వెబ్‌సైట్‌లు, ఏజెంట్లను నమ్మొద్దని శివహర్ష కోరారు.
Comments
Please login to add a commentAdd a comment