సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించిన రాషŠట్ర ప్రభుత్వం, అన్ని గ్రామాల్లో శరవేగంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా 2,526 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. రీ సర్వే పూర్తయి, ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సిల్ నంబర్) వచ్చిన గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది.
దశలవారీగా విస్తరణ
తొలిసారి 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించి, రెండోదశలో 1500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు మళ్లీ 2,526 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నది. ఇందుకోసం సచివాలయాలను సబ్ డిస్ట్రిక్టులుగా నోటిఫై చేసి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
బాధ్యతలు ఎవరికంటే...
అక్కడ పనిచేసే కార్యదర్శులకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా అధికారం కల్పించారు. డిజిటల్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కార్యదర్శులకు సహకరించే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం సీఎస్ జవహర్ రెడ్డి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు.
త్వరలో మరో రెండువేల గ్రామాల్లో...
ఇప్పటివరకు గ్రామ సచివాలయాల్లో 4 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందుకోసం సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై శిక్షణ ఇచ్చారు. గ్రామ సచివాలయాలతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూముల రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాలు, రెండో దశలో మరో 2 వేల గ్రామాల్లో పూర్తవడంతో ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలుండడంతో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభంకానున్నాయి.
ఆస్తుల రిజిస్ట్రేషన్ ఇక ఈజీ
ఆయా గ్రామాల ప్రజలు ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లను తమ సచివాలయాల్లోనే సులభంగా చేసుకోవచ్చు. తాజాగా అనుమతించిన గ్రామాలతో కలిపి మొత్తం 4,077 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించినట్లయింది. అలాగే ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు, ఈసీలు పొందడం వంటి పనుల్ని ఈ కార్యాలయాల్లోనే చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment