సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది.
వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే.
ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది.
18 నుంచి వర్షాలు కురిసే అవకాశం
ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment