సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి దందా
ఆయన తనయుడి కమీషన్లు ‘వేరే లెవెల్’
కప్పాలు కట్టలేక పరిశ్రమల యజమానుల లబోదిబో
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సర్వేపల్లి నియోజకవర్గానికి ‘ఎస్’ ట్యాక్స్ గుదిబండగా మారింది. దినసరి కూలీల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కప్పం కట్టాల్సిందే. లేదంటే భౌతిక దాడులతో ఆయన దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇక ఆయన తనయుడు (షాడో ఎమ్మెల్యే).. కాదేదీ కమీషన్లకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఆయన కప్పాలు కట్టలేక పారిశ్రామికుల నుంచి లేబర్ ఏజెన్సీల వరకు తలలు పట్టుకుంటున్నారు.
దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టులో విడుదలయ్యే బూడిదను కూడా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్లాంట్‌లో విడుదలయ్యే ఫ్లయాష్‌లో 20 శాతం ఉచితంగా సిమెంట్ కంపెనీలకు ఇవ్వాలి. మరో 80 శాతం విక్రయించవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకున్న షాడో ఎమ్మెల్యే ఉచితంగా ఇచ్చే 20 శాతం బూడిదను తనకే ఇవ్వాలని పట్టుబట్టి చేజిక్కించుకున్నాడు. దానిని సిమెంట్ కంపెనీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రతి నెలా రూ. 32 లక్షల ఆర్జించే ప్లాన్ ఇది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలో రొయ్యల ఫీడ్‌తో పాటు మేత తయారు చేసే వాటర్‌బేస్ లిమిటెడ్ కంపెనీలో 150 మంది వరకు రోజువారీ లేబర్‌గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ లేబర్ కాంట్రాక్టుపై టీడీపీ నేతల కన్నుపడింది. తమకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలని ఆ కంపెనీ ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగారు. దీనితో భయపడ్డ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకింది. లేబర్ కాంట్రాక్ట్‌ను వెంటనే టీడీపీ నేతలకు అప్పగించింది.
వెంకటాచలం మండలం కాకర్లవారిపాళెం ప్రాంతంలోని బేవరేజస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులను తొలగించి టీడీపీ కార్యకర్తల్ని పెట్టుకోమని డిమాండ్ పెట్టారు. అలాగే ఆ పరిశ్రమల్లో మెస్ నిర్వహణ కూడా తన అనుచరుడికే ఇవ్వాలని పట్టుబట్టి యాజమాన్యాన్ని వేధిస్తున్నారు.
కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటయిన ఫ్యాక్టరీలలో తయారయ్యే పామాయిల్‌ను తరలించే ట్యాంకర్ల నుంచి ‘ఎస్’ ట్యాక్స్ వసూళ్లకు తెరలేపారు. గత కొన్నేళ్లుగా పామాయిల్ ట్యాంకర్ల యజమానులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ అసోసియేషన్ నిర్వహణ కోసం ప్రతి లోడ్ ట్యాంకర్ నుంచి రూ. 300 వంతున వసూళ్లు చేసుకొనేవారు. షాడో ఎమ్మెల్యే కన్ను ఆయిల్ ట్యాంకర్లపై పడింది.
ఆ అసోసియేషన్ పాలకవర్గాన్ని మార్చేసి వెంటనే తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి అదనంగా రూ. 800 వంతున వసూళ్లు చేసుకునేలా ప్లానింగ్ చేసుకున్నాడు. దీంతో ప్రతిరోజు దాదాపు 150 వరకు ట్యాంకర్లు రూ. 1.2 లక్షలు వరకు ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాంకర్ల వద్ద అదనంగా రూ.4 వేలు వంతున వసూళ్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment