సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నం కి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తుపానుగా మారనుంది.
మరోవైపు.. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని దక్షిణ శ్రీలంకపై సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటరలఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. తుపాను ప్రభావం కోస్తా తీరం వెంబడి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వెల్లడించారు.
రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఆదేశించారు. ఖరీఫ్ వరి పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున.. కోతలు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కోతల్లో, కొనుగోళ్ల సమయంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదని చెప్పారు.
ఆయన గురువారం వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఖరీఫ్‌లో తక్కువ వర్షపాతం నమోదైనందున క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యం మేరకు పంట కోత ప్రయోగాలపై దృష్టి పెట్టాలన్నారు. జియో కోఆర్డినేట్‌లతో కూడిన యాప్‌లో ప్రైమరీ వర్కర్, పర్యవేక్షక అధికారి, ఇన్సూ్యరెన్స్ కంపెనీ కోఅబ్జర్వర్ల సంతకాలతో పూర్తి స్థాయి సమాచారాన్ని రియల్ టైమ్‌లో నమోదు చేస్తేనే పంటల బీమాకు అర్హత వస్తుందని తెలిపారు.
ఈ క్రాప్ నమోదుకు ఖరీఫ్‌లో ఇచ్చిన మార్గదర్శకాలే రబీలోనూ వర్తిస్తాయన్నారు. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. వచ్చే 3, 4 రోజుల్లో కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకునేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను అందించాలని సూచించారు. శనగ విత్తనాల కోసం డిసెంబర్ 15 లోగా ఇండెంట్ పెట్టాలన్నారు.
దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలోనే గ్యాప్ సర్టిఫికేషన్‌ను అమలు చేస్తున్నందున, ఎక్కువ మంది లబ్ధి పొందేలా కృషి చేయాలని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలను పొందిన ఉత్పత్తులకు గిరాకీ పెరిగేలా వివిధ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు సమాచారం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment