నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్‌’ మేత | TDP Leader Narayana Team Scam In Amaravati Lands | Sakshi
Sakshi News home page

నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్‌’ మేత

Published Wed, Sep 14 2022 4:37 AM | Last Updated on Wed, Sep 14 2022 4:37 AM

TDP Leader Narayana Team Scam In Amaravati Lands - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో టీడీపీ పెద్దల మరో భూబాగోతం బట్టబయలైంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన 1,110 ఎకరాల అసైన్డ్, లంక భూములను కొల్లగొట్టిన వ్యవహారం వెలుగు చూసింది. చంద్రబాబు సర్కారు అక్రమాల చిట్టాను సీఐడీ అధికారులు ఆధారాలతో సహా వెలికితీశారు. అసైన్డ్‌ భూముల దోపిడీ వ్యవహారంపై దుగ్గిరాలకు చెందిన వై.ప్రసాద్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి చేపట్టిన దర్యాప్తులో మొత్తం అక్రమాల బండారం బయటపడింది.

దళితులను బెదిరించి అసైన్డ్‌ భూములను కాజేయడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, బినామీగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణే కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నారాయణ తన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరిట 169.27 ఎకరాల అసైన్డ్‌ భూములను కొల్లగొట్టినట్లు తేలింది. ఇందులో నారాయణతోపాటు మాజీ మంత్రి గంటా పాత్ర కూడా స్పష్టంగా వెలుగులోకి వస్తోంది.

పలు సెక్షన్ల కింద కేసులు.. ఐదుగురి అరెస్టు
అసైన్డ్‌ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్‌ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు తాజాగా కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.

రామకృష్ణా హౌసింగ్‌ లిమిటెడ్‌ సిబ్బంది కొల్లి శివరామ్, గట్లెం వెంకటేశ్‌ను రాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా 41 ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చి దర్యాప్తు కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ముగ్గురు నిందితులను విశాఖలో అరెస్టు చేసి విజయవాడ తరలించారు.  

పరిహారం రాదంటూ ఫలహారం..
టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. ప్రధానంగా టీడీపీ పెద్దల కళ్లు అమరావతిలోని 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూములపై పడ్డాయి. అవన్నీ దళితులు, బలహీన వర్గాలకు చెందినవే. అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని అప్పటి సీఆర్‌డీయే కమిషనర్, గుంటూరు కలెక్టర్‌లతోపాటు పలువురు అధికారులు నారాయణకు వివరించినా ఖాతరు చేయలేదు.

వాటిని సొంతం చేసుకునేందుకు పక్కాగా పథకం వేశారు. రాజధాని కోసం అసైన్డ్‌ భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేయించారు. నారాయణ ఆదేశాలతో అధికారులు గ్రామాల్లో పర్యటించి కేవలం పట్టా భూములకే సర్వేలు చేశారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి సర్వే చేయడం లేదని అధికారులతో ప్రచారం చేయించారు.

ఇదే అదనుగా నిరు పేదలైన దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు నారాయణ తన సమీప బంధువైన కేవీపీ అంజని కుమార్‌ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను రంగంలోకి దించారు. అసైన్డ్‌ భూములను తాము కొనుగోలు చేస్తామని, లేదంటే అవన్నీ ప్రభుత్వ పరమైపోతాయని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధులు పేదలను నమ్మించారు.

వారిని బెదిరించి అతి తక్కువ ధరకు వాటిని తమపరం చేసుకున్నారు. నారాయణ అందుకోసం రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. అసైన్డ్‌ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) పొందారు. అనంతరం సేల్‌ డీడ్‌ల ద్వారా కథ నడిపించారు. 

ఇటు కాజేసి.. అటు లాగేసి!
మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, సన్నిహితుల ద్వారా 89.90 ఎకరాల అసైన్డ్‌ భూములను కొల్లగొట్టారు. రిజిస్ట్రేషన్‌ చట్టం 22–ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఈ భూములు అమరావతిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం పరిధిలో ఉన్నాయి.

నారాయణ వీటిని 84 సేల్‌ డీడ్ల ద్వారా తన బంధువులు, సన్నిహితులైన ధూళిపాళ్ల వెంకట శివ పానకాలరావు, ఆయన భార్య పద్మావతి, కోడలు డి.సృజన, లక్ష్మిశెట్టి సుజాత, లక్ష్మిశెట్టి సూర్య నారాయణ, అంబటి సీతారాము, లక్కాకుల హరిబాబు, లక్కాకుల పద్మావతి, చిక్కాల విజయ సారథి, పరుచూరి వెంకయ్య భాస్కరరావు, పరుచూరి వి.ప్రభాకరరావు (గంటా బంధువులు), కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, భార్య కొండయ్య విజయ, కొండయ్య వెంకటేశ్‌ తదితరుల పేర్లతో కొనుగోలు చేశారు.

నారాయణ తన బంధువులు, సన్నిహితులైన యాగంటి శ్రీకాంత్, కొల్లి శివరామ్, గుమ్మడి సురేశ్‌ పేరిట ఏకంగా 72 జీపీఏలు చేసి మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ ఏ.గోపాల్‌ నిరాకరించారు. ఆయనపై టీడీపీ పెద్దలు ఎంత ఒత్తిడి తెచ్చినా సమ్మతించలేదు. దీంతో అసైన్డ్‌ భూములపై తాము చేసుకున్న సేల్‌ డీడ్ల ఆధారంగానే ఆ భూములను నారాయణ బంధువులు హస్తగతం చేసుకున్నారు.

అనంతరం ఆ అసైన్డ్‌ భూములను రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించినప్పుడు వాటిని తామే సీఆర్‌డీయేకు ఇచ్చినట్లుగా చూపించారు. అందుకు ప్రతిగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య స్థలాలు పొందే జాబితాలో తమ పేర్లు ఉండేలా చేసుకున్నారు. తద్వారా భూసమీకరణ కింద ఇచ్చిన భూములకు ప్రతిగా ఎకరానికి 800 గజాల నివాస స్థలం, వంద గజాల వాణిజ్య స్థలాన్ని రాజధాని ప్రాంతంలో తమకు వచ్చేటట్లు చూసుకున్నారు.  

వియ్యంకుడితో భూ విందు!
అమరావతిలో టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన 1,100 ఎకరాల్లో 169.27 ఎకరాల అసైన్డ్‌ భూములను మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, సన్నిహితుల పేరిట దక్కించుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అందులో 89.90 ఎకరాలను బంధువుల పేరిట నారాయణ కొల్లగొట్టగా మరో 79.45 ఎకరాలను ఆయన  వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువుల పేరిట గుప్పిట పట్టారు.

నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లు రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బదలాయించి అసైన్డ్‌ భూములను కాజేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూముల్లో మిగిలినవి టీడీపీ ముఖ్యులు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్నాయి. వాటిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. 

సీఐడీ అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు
► కొల్లి శివరామ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్‌ లిమిటెడ్‌ ఉద్యోగి)
► గట్లెం వెంకటేశ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్‌ లిమిటెడ్‌ ఉద్యోగి)
► చిక్కాల విజయ సారథి, విశాఖపట్నం
► బడే ఆంజనేయులు, విశాఖపట్నం
► కొట్టి కృష్ణ దొరబాబు, విశాఖపట్నం

గంటా కోటాలో మరో 79.47 ఎకరాలు 
అమరావతిలో మరో 79.47 ఎకరాల అసైన్డ్‌ భూములను కూడా నారాయణ తన వియ్యంకుడైన గంటా శ్రీనివాసరావు బంధువులు, సన్నిహితుల ద్వారా దక్కించుకున్నారు. బోరుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నేలపాడు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని వివిధ సర్వే నంబర్లలో 79.47 ఎకరాలను 76 సేల్‌ డీడ్ల ద్వారా తమపరం చేసుకున్నారు.

కొట్టి కృష్ణ దొరబాబు, గుమ్మడి సురేశ్, కొల్లి శివరామ్‌లు వాటిపై జీపీఏ ఒప్పందాలు చేసుకుని ఆ భూములు తమకు చెందినవని చూపారు. దళారీలు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గుమ్మడి సురేశ్, సఫియుల్‌ రహమాన్, పొట్లూరి జయంత్, ఆల వెంకట సుబ్బయ్య, పిడపర్తి టిటుస్‌ బాబు, శీలం శ్రీనివాసరావు తదితరులు ఈ అసైన్డ్‌ భూములను నారాయణ తన బంధుగణం ద్వారా దక్కించుకోవడంలో పాత్ర పోషించారు.

కాగా సీఐడీ అధికారులు అరెస్టు చేసిన కొట్టి కృష్ణ దొరబాబు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నమ్మిన బంటు కావడం గమనార్హం. టీడీపీ హయాంలో గంటా మంత్రిగా ఉండగా ఆయన్ను ఆంధ్రా వర్సిటీ దూరవిద్యా కేంద్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కాంట్రాక్టు విధానంలో నియమించారు. జాగ్రఫీలో పీహెచ్‌డీ చేసిన ఆయన ఉద్యోగం పొందిన సమయంలో వర్సిటీలో అలాంటి కోర్సు లేకున్నా అవకాశం కల్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement