
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు పీఆర్సీపై ‘ఈనాడు’ మరోసారి తన మార్కు విషం వెళ్లగక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలో అత్యధిక రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ప్రకటించింది. తద్వారా ఏటా రూ.11,707 కోట్ల ఆర్థిక భారం భరించేందుకు సిద్ధపడింది. కానీ, ఈనాడు పత్రిక మాత్రం ‘అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులకు వక్రభాష్యం చెబుతూ ‘ప్రభుత్వంపై పీఆర్సీ భారం రూ.3,181 కోట్లే’ అనే శీర్షికన అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనదైన శైలిలో కమిటీ నివేదికకు వక్రభాష్యాలు చెబుతూ అసత్యాలతో కథనాన్ని వండివార్చింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఈ కథనం.
ఏటా అదనపు ఆర్థికభారం రూ.11,707 కోట్లు
23 శాతం ఫిట్‌మెంట్ అమలుచేస్తూ ఈ ఏడాది జనవరి 17న జారీచేసిన రెండు జీఓల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, హెచ్‌ఆర్‌ఏతో పాటు, అదనపు పెన్షన్ మొత్తం (ఏక్యూపీ) చెల్లింపుల వల్ల ప్రభుత్వంపై అదనంగా పడిన ఆర్థిక భారం రూ.10,247 కోట్లు. ఆ తర్వాత ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు, వేతనాల సవరణపై ఉద్యోగులకు ఉన్న అపోహలు తొలగిస్తూ, వారి సందేహాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఆ ఉప సంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం హెచ్‌ఆర్‌ఏ, ఏక్యూపీతో పాటు, సీసీఏలు సవరించాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వంపై మరో రూ.1,460 కోట్ల భారం పడుతోంది. దీంతో 11వ పీఆర్సీ అమలువల్ల ప్రభుత్వంపై అదనంగా పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు.
► అలాగే, 2019 జూలై నుంచి 2020 మార్చి వరకు ఇచ్చిన ఐఆర్‌ను తిరిగి వసూలు చేయకూడదని తీసుకున్న నిర్ణయంవల్ల ప్రభుత్వంపై ఒకేసారి రూ.5,156 కోట్ల భారం పడింది.
► ఐఆర్‌తో పాటు, కొత్తగా ఫిట్‌మెంట్ ఇస్తూ అమలుచేసిన వేతనాల సవరణ వల్ల ప్రభుత్వంపై పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ అనుకూల పత్రిక ఈనాడు మాత్రం పీఆర్సీతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఏటా రూ.3,181 కోట్లేనంటూ అవాస్తవాలను ప్రచురించి ఉద్యోగులు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు వాస్తవాలను వక్రీకరిస్తూ బురదజల్లేందుకు యత్నించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం, భారతీయ కార్మిక సదస్సు (ఐఎల్‌సీ) నియమాలకు అనుగుణంగా వేసిన గణాంకాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సూచించింది. అయితే, ఉద్యోగులకు అప్పటికే 27 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ఇస్తున్నందున అంతే ఫిట్‌మెంట్ ఇవ్వాలని 11వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది.
ఎందుకంటే అంతకుముందు ఎక్కువ మొత్తంలో ఇచ్చిన ఫిట్‌మెంట్స్‌వల్ల ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) గణనీయంగా పెరిగి రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్) కంటే కూడా ఉద్యోగుల జీతభత్యాల వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో.. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలు సవరించాలన్న ప్రక్రియ కార్యరూపం దాల్చడం కష్టమని కమిటీ భావించింది. అందుకే కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం (సీపీసీ) సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసింది.
సిఫారసు చేయకపోయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 23శాతం ఫిట్‌మెంట్
ఇక మరో పచ్చపత్రిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30శాతం స్కేల్ పెంచాలని పీఆర్సీ కమిటీ సిఫార్సులంటూ అవాస్తవాలను ప్రచురించడం విస్మయపరుస్తోంది. వాస్తవం ఏమిటంటే.. 11వ పీఆర్సీ కమిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై ఎలాంటి సిఫార్సులూ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సానుకూల దృక్పథంతో స్పందించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 23శాతం ఫిట్‌మెంట్ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా ఏటా రూ.430కోట్ల ఆర్థిక భారాన్ని వహించేందుకు సిద్ధపడింది.
ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సంక్షేమానికే పెద్దపీట
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి పీఆర్సీ విధానాన్ని అమలుచేస్తూ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాన్నే అమలుచేశాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాయి. కేరళ ప్రభుత్వం అంతకంటే తక్కువగా 10 శాతం ఫిట్‌మెంట్ మాత్రమే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమానికి మరింత ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్‌మెంట్ కంటే ఇది చాలా ఎక్కువ. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుచేస్తామని కూడా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment