సాక్షి, అమరావతి: పట్టణ నిరుపేదలు ఇళ్లు పొందాలంటే నిర్ణీత మొత్తం చెల్లించాలని షరతు విధించి టిడ్కో లబ్ధిదారులపై బ్యాంకు రుణాల భారాన్ని మోపిన చంద్రబాబు ఏ ఒక్కరికీ సొంత గూడు కల్పించిన దాఖలాలు లేవు. ప్రచార ఆర్భాటం మినహా ఏ ఒక్కటీ పూర్తి చేయలేదు. పేదల కనీస అవసరాల పట్ల అంత దారుణంగా వ్యవహరించినా ఎల్లో మీడియా నాడు ప్రశ్నించిన పాపాన పోలేదు! ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లను తీర్చిదిద్ది పేదలకు అప్పగిస్తుంటే బరి తెగింపు రాతలకు తెగబడుతోంది!
నాడు గత ప్రభుత్వంలో లబ్ధిదారుల పేరిట బ్యాంకు రుణాలను తీసుకున్నారు. ఇందులో 300 చ.అ. విస్తీర్ణం లబ్ధిదారులు 7,510 మందికి రూ.95 కోట్లు, 365, 430 చ.అ. యూనిట్ల లబ్ధిదారులు 5,058 మందికి మరో రూ.87 కోట్లు చొప్పున మొత్తం రూ.182 కోట్లు తీసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఎన్‌పీఏగా మారింది చంద్రబాబు సర్కారు హయాంలోనే కావడం గమనార్హం.
నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1,43,600 మంది 300 చ.అ. లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే అందిస్తోంది. మరో 65,671 మంది (365, 430 చ.అ.) లబ్ధిదారులకు రూ.1,778 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. టీడీపీ సర్కారు ఎన్‌పీఏగా మార్చిన 300 చ.అ లబ్ధిదారుల రుణాలు రూ.110 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021, 2022లో చెల్లించింది. 365, 430 చ.అ. లబ్ధిదారుల పేరిట గత ప్రభుత్వం తీసుకున్న బ్యాంకు రుణాలపై రూ.40 కోట్ల వడ్డీని లబ్ధిదారుల తరఫున ఏపీ టిడ్కో చెల్లించింది. దీంతో పాటు చంద్రబాబు జమానాలో రుణాలు తీసుకున్న 5,058 మంది 365, 430 చ.అ. లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇళ్లను ఇచ్చారు. దీంతో గత ప్రభుత్వంలో ఎన్‌పీఏగా మారినవారి సంఖ్య 3,058కి తగ్గింది.
నాడు గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరికీ ఇళ్లను కేటాయించలేదు.
నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 65,671 మంది 365, 430 చ.అ. యూనిట్ల లబ్ధిదారుల్లో 31,558 మందికి ఇళ్లను అప్పగించడంతో వారెవరూ ఎన్‌పీఏలుగా మారలేదు. బ్యాంకు రుణాలు తీసుకున్న మరో 33,752 మందికి ఇళ్లను ఆగస్టు నాటికి అందజేయాలని నిర్ణయించారు. అంటే వారు కూడా ఎన్‌పీఏ పరిధిలో లేరు. ఫేజ్–2 టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో 361 మంది మాత్రమే నవంబర్ నాటికి రూ.12.65 కోట్ల మేర ఎన్‌పీఏగా మారనున్నట్లు అంచనా. వీరికి డిసెంబర్‌లో ఇళ్లను ఇవ్వనున్నారు. అంటే కేవలం ఒక్క నెల మాత్రమే ఎన్‌పీఏగా మారే అవకాశం ఉంది. అయితే ఆ భారం లబ్ధిదారులపై పడకుండా ప్రభుత్వమే చెల్లించనుంది.
తప్పుడు కథనాలు..
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను పట్టణ పేదలకు అందిస్తోంది. ఇందులో 300 చ.అడుగుల్లో నిర్మించిన 1.43 లక్షల ఇళ్లను నిరుపేదలకు ఒక్క రూపాయికే ఇస్తున్నాం. వీటిపై ఎలాంటి రుణం తీసుకోలేదు. మిగిలిన 1.19 లక్షల ఇళ్లల్లో 60 వేల యూనిట్ల నిర్మాణం పూర్తైంది. వీటిని త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం.
మిగిలిన ఇళ్ల విషయంలో కూడా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏ కేటగిరిలోనూ ఇళ్ల లబ్ధిదారులపై భారం ఉండదు. ఎల్లో మీడియా పనిగట్టుకొని తప్పుడు కథనాలు రాస్తూ ప్రజల్లో అయోమయం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నిర్లక్ష్యం, తప్పిదాలను కూడా ప్రచురించాలి.
– డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి
Comments
Please login to add a commentAdd a comment