
గంజాయి దందా పాపం చంద్రబాబుదే రామోజీ
మంచి చేయడం కూడా మీ దృష్టిలో తప్పేనా?
నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ నేతల గంజాయి సిండికేట్
స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
సీఎం జగన్ ఆదేశాలతో ఆపరేషన్ పరివర్తన్
గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సాహం
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు
రామోజీ దుష్ప్రచారం చూస్తుంటే ఆయన ఎంతగా భయపడిపోతున్నారో స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు చేసిన పచ్చ బ్యాచ్ గురించి అక్షరమ్ముక్క రాయని ఈ గురివింద.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ తప్పుడు రాతలతో రెచ్చిపోతున్నారు.
రాసిందే రాస్తూ.. చెప్పిందే చెబుతూ.. ‘పచ్చ’ మత్తు కిక్కులో అనునిత్యం ప్రభుత్వంపై కక్షగట్టి వ్యవహరిస్తుండటం రామోజీకి పరిపాటిగా మారింది. సీఎం జగన్ చేస్తున్న ప్రతి మంచి పనిలోనూ కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకాలన్న చందంగా వ్యవహరిస్తుండటం చూస్తుంటే రామోజీ పచ్చ పిచ్చి వైద్యానికి అందనంతగా ముదిరిపోయిందని స్పష్టమవుతోంది.
సాక్షి, అమరావతి : ఎక్కడైనా దొంగలను పట్టుకుంటే పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నట్టు భావిస్తారు. కానీ రామోజీరావు మాత్రం అలాంటి మంచిని ప్రభుత్వ అసమర్థతగా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి దందాపై ఉక్కుపాదం మోపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగును ధ్వంసం చేయడంతో పాటు గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తోంది.
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తోంది. నిందితులను అరెస్ట్ చేస్తోంది. అంత సమర్థంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశంసించాలి. రామోజీరావు మాత్రం.. ‘చూడండి.. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.. ఇదంతా ఈ ప్రభుత్వ తప్పిదమే’ అని టముకేస్తూ వక్రభాష్యం చెబుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం హయాంలో చేసినట్టుగా గంజాయి దందాను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండాలన్నది రామోజీరావు ఉద్దేశమేమో! దశాబ్దాలుగా గంజాయి సాగు, అక్రమ రవాణా సాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. గంజాయి సాగును ధ్వంసమూ చేయలేదు. అక్రమ రవాణాను అడ్డుకోలేదు. దీని వెనుక అసలు రహస్యమేంటంటే.. టీడీపీ ప్రభుత్వంలో గంజాయి దందా సాగించింది అంతా పచ్చ నేతలే. అదే రామోజీరావుకు నచ్చింది. తద్భిన్నంగా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయి దందాకు అడ్డుకట్ట వేస్తుంటే రామోజీరావు సహించలేకపోతున్నారు.
జాతీయ స్థాయిలో ప్రశంసలు
గంజాయి దందాను నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్‌ను అభినందించింది. ప్రత్యేక పరిశీలకులను పంపించి ఆపరేషన్ పరివర్తన్ పై అధ్యయనం చేయించింది. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. దేశం మొత్తం మీద గంజాయి సాగు ధ్వంసంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం
దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ–క్రాపింగ్ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలను పంపిణీ చేసింది.
పచ్చ పెద్దలదే గంజాయి దందా
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆయనకు అత్యంత సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా గంజాయి సిండికేట్‌ను నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో యథేచ్ఛగా గంజాయి సాగు చేయించారు. అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఈ గంజాయి దందాకు పూర్తి అండదండలు అందించారు.
గంజాయి సాగును అడ్డుకుంటే గిరిజనులు నక్సలైట్లకు అనుకూలంగా మారతారన్న వితండవాదాన్ని బాబు ప్రభుత్వం తీసుకురావడాన్ని ఈనాడుకు కనిపించినట్లు లేదు. ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వం గంజాయి దందాకు పచ్చ జెండా ఊపడంతో విశాఖపట్నం ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు యథేచ్ఛగా సాగిపోయింది.
విశాఖపట్నం ఏజెన్సీలో సాగు చేసిన గంజాయిని నర్నీపట్నంలోని టీడీపీ సిండికేట్ నేతలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులతోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. అందుకోసం ప్రత్యేకంగా వ్యవస్థీకృత కొరియర్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు. ఆ విధంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు ద్వారా టీడీపీ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల రూపాయలు ఆర్జించారు.
11,550 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి దందాపై ఉక్కుపాదం మోపింది. ఈ సాగును నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు యంత్రాంగాన్ని విస్పష్టంగా ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను తుదముట్టించేందుకు ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ‘సెబ్’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని చేపట్టింది.
ముందుగా గంజాయి సాగు వల్ల అనర్థాలపై ఆపరేషన్ పరివర్తన్ ద్వారా ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర –ఒడిశా సరిహద్దు పాంత్రాన్ని జీయో మ్యాపింగ్ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో సాగును ధ్వంసం చేశారు. రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు.
ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయిని ఆంధ్ర ప్రదేశ్ గుండా అక్రమ రవాణానూ పోలీసు యంత్రాంగం సమర్థంగా అడ్డుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment