రాయి తగిలినట్టుండాలి.. ప్రాణం పోవాలి...  | ysrcp leaders comments on tdp behind attack on Jagan | Sakshi
Sakshi News home page

రాయి తగిలినట్టుండాలి.. ప్రాణం పోవాలి... 

Published Mon, Apr 15 2024 4:29 AM | Last Updated on Mon, Apr 15 2024 4:29 AM

ysrcp leaders comments on tdp behind attack on Jagan - Sakshi

సీఎం జగన్‌ హత్యకు పక్కాగా పథక రచన  

జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే బాబు కుట్రలు  

జగన్‌ను మసి చేస్తాం.. అంటూ ఇటీవల టీడీపీ అధినేత ప్రసంగాలు 

వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ధ్వజం 

సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విజయవాడ నడిబొడ్డున ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, ఎమ్మెల్యేలు చెప్పారు. రాయలసీమ­తో పాటు కోస్తాలోనూ, మరీ ముఖ్యంగా విజయవాడలో కూడా సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పలువురు మీడియాతో మాట్లాడారు.  

ఇది చంద్రబాబు కుట్ర   
సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రపూరితం. చంద్రబాబే దీనికి కారకుడు. విజయవాడ నడిపోడ్డున బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు హారతులు పడుతుంటే  తట్టుకోలేకే చంద్రబాబు ఇలా చేయించారు. యాత్రకు వచ్చిన జనాన్ని టీవీల్లో ప్రజలు చూస్తే టీడీపీకి పుట్టగతులుండవని భయపడే చంద్రబాబు ఈ దురాగతానికి పాల్పడ్డారు. సీఎం జగన్‌నుద్దేశించి చంద్రబాబు చాలాసార్లు మసి చేస్తాం.. అన్నారు.. జగన్‌ను మసి చేయాలనే ప్రయత్నంలో భాగమేనా ఈ హత్యాయత్నం? జగన్‌ను ఎదుర్కోలేకే చంద్రబాబు కూటమి కట్టారు. సీఎం జగన్‌ ఉంటే రాజకీయం చేయలేమన్న నిర్ణయానికి వచ్చాకే చంద్రబాబు ఇలా చేశారు. అందుకే విజయవాడను సరైన ప్రదేశంగా బాబు ఎంచుకున్నారు. రాయి తగిలినట్టుండాలి.. ప్రాణం పోవాలి.. అనే రీతిలో ఇదంతా పక్కాగా ప్లాన్‌ చేశారన్న విషయం అర్థమవుతోంది.       – వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ నాయకురాలు   

బెజవాడలో ప్రజల బ్రహ్మరథం తట్టుకోలేకే..   
మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో జరిగేటప్పుడు ప్రజాబలం అంతగా ఉండదని చంద్రబాబు భావించారు. అయితే బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎన్నో సభల్లో చంద్రబాబు.. సీఎం జగన్‌ బచ్చా.. అంతు చూస్తాం.. మసి చేస్తాం అన్నారు. లోకేశ్‌ అయితే ఎంత మందిని కొట్టి వస్తే.. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుని వస్తే అంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అన్నారు. వీటన్నిటినీ గమనిస్తే ఓ షార్ప్‌ షూటర్‌తో చేయించిన హత్యాయత్నం ఇదని అర్థమవుతోంది. అదే రాయి నుదిటిపైన, కంటిపై తగిలి ఉంటే పరిస్థితేంటి?       – హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్యే    

రంగా హత్యకు ప్లాన్‌ చేసినట్టుగా..  
సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి బాబుకి ఓటమి భయం పట్టుకుంది. వెన్నులో వణుకు పుట్టి హత్యాయత్నం చేశారు. ఇలాంటి హింసా రాజకీయాలు చేస్తే 2024 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి సమాధి కడతారు. మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కళ్లెర్రజేయండి.. సీఎం జగన్‌ను సమాధి చేసి, సీసం పోసి, కంకరేసి సమాధి కట్టండి.. అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. సీఎం జగన్‌ బస్సు యాత్రకు రాయలసీమ దాటాక ప్రజాదరణ తగ్గుతుందనుకున్నారు. దానికి మించి మరింతగా విజయవాడలో జనం రావడం చూశారు. రంగా హత్యకు ప్లాన్‌ చేసినట్టుగా అప్పటికప్పుడు ప్లాన్‌ చేశారు. దేవుడి ఆశీస్సులు, ప్రజా దీవెనలతో హత్యాయత్నం నుంచి సీఎం జగన్‌ బయటపడ్డారు.– పోతుల సునీత, ఎమ్మెల్సీ  

బస్సు యాత్రను సీఎం జగన్‌ కొనసాగించి తీరతారు..  
విజయవాడ నడిపోడ్డులో 206 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొలి్నన రోజు నుంచి ఒక వర్గానికి చెందిన కొందరు సీఎం జగన్‌పై కక్షగట్టారు.  గతంలో టీడీపీ కూడా సీఎం జగన్‌పై అక్రమ కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించింది. కోడి కత్తి దాడిలో కూడా టీడీపీ నేతల ప్రమేయం ఉంది. చంద్రబాబు తన ప్రసంగాల్లో రాళ్ల దాడులకు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పుతున్నారు. ఇది దురదృష్టకరమైన విషయం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బస్సు యాత్రను జగన్‌ కొనసాగిస్తారు.    – కె.రాజశేఖర్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి   

చంద్రబాబుది దింపుడు కళ్లెం ఆశ
దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు. తాడికొండ, ఇతర చోట్ల చంద్రబాబు మాట్లాడిన మాటల్ని ఒకసారి గమనిస్తే..  హత్యాయత్నం ఎవరు చేయించారన్నది స్పష్టంగా అర్థమవుతుంది.  దీనిలో ప్రథమ నిందితుడిగా చంద్రబాబును చేర్చాలి. ఇది ఎన్నికల స్టంట్‌ అని అచ్చెన్నాయుడు అంటున్నారు. అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిగిన దాడి కూడా ఎన్నికల స్టంటా? ఎన్టీఆర్‌ సభలో మల్లెల బాబ్జి చేసిన దాడి కూడా ఎన్నికల స్టంటా?       –  కొమ్మూరి కనకారావు, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌   

ఇలాంటి దాడులకు బెదిరే వ్యక్తికాదు వైఎస్‌ జగన్‌ 
నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టాలని చెప్పారు. చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో విజయవాడలో హత్యాయత్నం చేశారు. దీన్ని ఖండించాల్సిన కొందరు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. అలిపిరి ఘటనను నటన అని ఎవరైనా అన్నారా? ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్సార్‌ చంద్రబాబుకు సంఘీభావంగా తిరుపతిలో మౌనదీక్ష చేశారు. చంద్రబాబు భుజాలు తడుముకోవడం చూస్తే వీళ్లే దాడి చేయించి ఉంటారని కచ్చితంగా భావించాల్సి వస్తోంది. ఇలాంటి దాడులకు బెదిరే వ్యక్తి కాదు వైఎస్‌ జగన్‌. 2024 ఎన్నికల్లో సీఎం రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు.       – అప్పిరెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌

ప్రాణాపాయం సంభవించి ఉండేది
సీఎం వైఎస్‌ జగన్‌పై విజయవాడలో జరిగిన హత్యాయత్నం ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఈ హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎంకు అయిన లోతైన గాయాన్ని పరిశీలిస్తే చాలా పదునైన వస్తువుతోనే దాడిచేసినట్టు అర్థమవుతోంది. ఆ పదునైన వస్తువు కనుబొమ్మకు కొంత కింద తగిలి ఉంటే కంటిచూపు కోల్పోయేవారు. మరోవైపు  పరిశీలిస్తే పుర్రె భాగంలో ఎంతో సున్నితమైన ప్రదేశాన్నే ఎంచుకుని  ఈ దురాగతానికి పాల్పడినట్టు స్పష్టం అవుతోంది.

ఈ క్రమంలో మెదడులోని మాటలను నియంత్రించే బ్రోకా ప్రదేశానికి బలమైన దెబ్బ తగిలినట్లైతే శాశ్వతంగా మాట కోల్పోయే ప్రమాదం ఉండేది. అదేవిధంగా కణతి, తల భాగంలో ఎక్కడ తగిలినా బ్రెయిన్‌ ఇంజ్యూరి అయి ప్రాణాపాయం సంభవించి ఉండేది. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో తలకు బలమైన గాయంతో బ్రెయిన్‌ డెడ్, కోమాలోకి వెళ్లడం వంటివి తరచు  చూస్తుంటాం.     – డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement