
అంగళ్లు సభలో మాట్లాడుతున్న శంకర్
బి.కొత్తకోట: తంబళ్లపల్లె టీడీపీలో అసెంబ్లీ టికెట్ వ్యవహారం ముదిరిపాకాన పడింది. పార్టీ టికెట్ కోసం వర్గాల మధ్య పోరు సాగుతుంటే..వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేది తానేనని ప్రకటించుకున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. దీంతో శంకర్ వ్యతిరేక వర్గాలు టికెట్ తనకే అని ఎలా ప్రకటించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
2014 నుంచి శంకర్ టీడీపీలో ఉంటుండగా, ఈ మధ్యకాలంలో మరో ఇద్దరు టికెట్ తమకూ కావాలంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘మీకెవ్వరికి కాదు మా నాయకుడికే టికెట్’ అంటూ స్థానికంగా లేని మరో నాయకుడి వర్గం ప్రచారం మొదలెట్టింది. ఈనెల 19న బి.కొత్తకోటలో జరిగిన జయహో బీసీ సభలో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ తనదే అని, పోటీచేస్తున్నట్టు శంకర్ ప్రకటించుకున్నారు.
ఈ ప్రకటనపై తేలిగ్గా తీసుకున్న పోటీ వర్గాలకు పుండుమీద కారం చల్లినట్టుగా మంగళవారం కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన బీసీ సభకు హజరైన శంకర్ మాట్లాడుతూ టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్నానని మరోసారి ప్రకటించుకున్నారు. ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదని, స్వయంగా టికెట్ తనకేనని ఎలా ప్రకటించుకుంటారని కొందరు నేతలు శంకర్‌పై మండిపడుతున్నారు.
మరో ముగ్గురు ఆశావహులు
కాగా ఇటీవల టీడీపీలో చేరిన ఓ నాయకుడు లాబీయింగ్ ద్వారా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండునెలల క్రితమే తెరపైకి వచ్చిన ఆయన..చంద్రబాబు, లోకేష్‌లను కలిసిన ఫొటోలతో టికెట్ తనకే ఇస్తారని ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం.
టీడీపీ వర్గాల మద్దతు లేకపోయినా నియోజకవర్గంలో పర్యటనలు సాగిస్తున్నారు. గతనెలలో ఓ ఎన్‌ఆర్‌ఐ తాను టీడీపీలోనే ఉన్నానని, కొత్తగా పార్టీలో చేరాల్సిన అవసరం లేదని ప్రకటించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.
టీడీపీ–జనసేన పొత్తులో తమ నాయకుడికి టీడీపీ లేదా జనసేన టికెట్ ఖరారైనట్టే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇకపోతే స్థానికంగా లేని ఓ నాయకుడి వర్గీయులు టీడీపీ టికెట్‌పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమ్ముళ్ల తికమక
టీడీపీ టికెట్ ఎవరికిస్తారో స్పష్టత లేకపోవడం తమ్ముళ్లు తికమక పడుతున్నారు. ప్రత్యక్షంగా టికెట్ కోసం మూడు వర్గాలు పోటీలో ఉండగా చివరకు ఎవరికి టికెట్ ఇస్తారో టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టత లేదు. దీంతో కార్యకర్తలు ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారు.
మరోవైపు తంబళ్లపల్లెలో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసలే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పైగా వర్గాల మధ్య పోరు ముదిరి పాకాన పడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.