ఆదాయానికి ‘గండి’ కొట్టే యత్నం! | - | Sakshi
Sakshi News home page

ఆదాయానికి ‘గండి’ కొట్టే యత్నం!

Published Fri, Jan 31 2025 1:12 AM | Last Updated on Fri, Jan 31 2025 1:12 AM

-

చక్రాయపేట : గండి వీరాంజనేయుడి దగ్గర మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సమర్పించే తలనీలాలను పోగు చేసుకునే హక్కు తో పాటు ఒక భాగం కొబ్బరి చిప్పలు సేకరించుకునేందుకు దేవదాయశాఖ అధికారులు నిర్వహించిన టెండర్లలో టెండరుదారుల పాచిక పారలేదు. స్వామి ఆదాయానికి గండి కొట్టి లబ్ధి పొందాలనుకుని అందరూ సిండికేట్‌ కావడంతో అధికారులు టెండర్లను రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గండిలో ఏడాది కాలం పాటు తలనీలాలు సేకరించుకునే హక్కు కోసం రు.25 లక్షల చొప్పున డిపాజిట్‌ మొత్తం చెల్లించి టెండర్లలో 9 మంది పాల్గొన్నారు. గత ఏడాది తలనీలాల టెండరు రు.65 లక్షలు పలికింది. ఈ మొత్తంతో పాటు ప్రస్తుతం మార్కెట్‌లోని వెంట్రుకల ధరలను బేరీజు వేసుకొని ఆలయ అధికారులు వేలం పాటను రూ.60 లక్షల నుంచి ప్రారంభించారు. ఇందుకు ఎవరూ నోరు మెదపక పోవడంతో తగ్గించుకుంటూ చివరకు రూ.49 లక్షలతో పాటను మొదలు పెట్టినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు తలనీలాల టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఒక భాగం కొబ్బరి చిప్పలు సేకరించుకొనే హక్కుకు నిర్వహించిన టెండర్లలోనూ అదే పరిస్థితి నెలకొనడంతో అధికారులు దాన్ని కూడా రద్దు చేశారు. కాగా కొందరు ఎలాగైనా తమకే టెండరు దక్కాలని లేకుంటే మీరు ఇక్కడి నుంచి వెంట్రుకలు, కొబ్బరి చిప్పలు ఎలా తీసుకెళతారో మీ అంతు చూస్తామని బెదిరింపులకు దిగడంతోనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు నోరు మెదపకుండా కూర్చున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేదంటే పెద్ద ఎత్తున తమకు కమీషన్లు ఇవ్వాలని కూడా బెదిరించినట్లు సమాచారం.

మళ్లీ టెండర్లు పిలుస్తాం

తలనీలాలు, కొబ్బరి చిప్పల టెండర్లలో తగిన ధర రానందున టెండర్లను రద్దు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటసుబ్బయ్య తెలిపారు. దేవదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు తిరిగి టెండర్లను పిలుస్తామని చెప్పారు. ఆలయ చైర్మన్‌ కావలి కృష్ణ తేజ, మాజీ చైర్మన్లు వెంకటస్వామి, వీరభాస్కరుడు, ఆలయ ప్రధాన, ఉప ప్రధాన ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్‌, రాజ గోపాలాచార్యులు, కడప దేవదాయ శాఖ పర్యవేక్షకుడు శివయ్య, ఆలయ సూపరింటెండెంట్‌ షరీఫ్‌,ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement