
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
నాలుగు మెతుకులు తింటున్నాం..
ఇదిగో మంచం మీద కూచున్నాడే ఆయన నా పెనిమిటి లక్ష్మయ్య. సరిగ్గా కనపడదు, వినపడదు. ఏ పనీ చేయలేకపోతున్నాడు. నా ఆరోగ్యం కూడా అంతంతే.. ఇద్దరం ఒకేసారి మూలన పడిపోయాం. తప్పదన్నట్లు నేనే సత్తువ తెచ్చుకుని ముసలాయనకి దగ్గరుండి అన్ని పనులు చేసిపెడుతున్నా. కొడుకో..కూతురో ఉండుంటే ఒక ముద్ద పెట్టేవాళ్లు. కానీ మాకా భాగ్యం లేదు. మా గతి ఏంగానూ అనుకున్న సమయంలో వలంటీర్ వచ్చి పింఛన్ సొమ్ము నెలకు రూ. 2,500 ఇచ్చెళ్తోంది.
ఇప్పుడు మూడు పూటలా నాలుగు మెతుకులు తింటున్నామంటే ఆ మహానుభావుడి దయే. ఆసరా లేని మాకు పింఛను ఇచ్చి పెద్ద దిక్కయ్యాడు. చెరువు కట్టమీద ఉన్న ఇదిగో ఈ చిన్న గుడిసెలోనే ఇద్దరం తలదాచుకుంటున్నాము. పిల్లలు లేని మేము కూలీ నాలీ చేసుకుని బతికేటోళ్లం. ఇప్పుడెటూ కదల్లేకపోతున్నాం. ఏ సమయంలో ఎలా ఉంటుందా? అని గాబరా పడుతున్న సమయంలో పింఛనే మమ్మల్ని బతికిస్తోంది.
ఐదేళ్ల కిందట పింఛన్ కోసం పంచాయతీ ఆఫీసు దగ్గరకెళ్లి పడిగాపులు కాసేటోళ్లం. కాళ్లరిగేలా నాలుగైదురోజులు తిరిగితే తప్ప పింఛన్ డబ్బులు దక్కేవికావు. రేషన్ బియ్యానిక్కూడా చాలా దూరం నడిచెళ్లి గంటలు తరబడి లైన్లో నిలబడేటోళ్లం. ఈ ప్రభుత్వం దయతో ఇప్పుడు తిన్నగా ఇంటికే తీసుకొచ్చిస్తున్నారు. ఆ బియ్యం, పింఛన్ డబ్బులతో హాయిగా బతుకుతున్నాం. పిల్లలు లేని మాకు జగనే కొడుకులా బతికిస్తున్నాడు. – బండి మునెమ్మ, అల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ఎస్‌కె.మన్సూర్, విలేకరి, అల్లూరు)
ఈ షాపునకు నేనే యజమాని
పలమనేరులోని కంసాలీ వీధిలో పాత పెంకుటింట్లో ఐదుగురు పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. నా భర్త పనికెళ్తున్నప్పటికీ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది. డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా చిన్న చిన్న రుణాలు తీసుకొని కుటుంబ అవసరాలకు వాడుకుంటూ వచ్చా. గ్రూపులో బ్యాంకు లింకేజి రుణంగా రూ.80 వేలు తీసుకొని పట్టణంలోని మారెమ్మగుడి వెనుక చిన్న చిల్లర కొట్టు పెట్టాను.
తీసుకున్న రుణాన్ని కట్టుకుంటూ మెల్ల మెల్లగా దుకాణాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చా. మా కుటుంబానికి దుకాణమే ఆధారంగా మారింది. ఈ ప్రభుత్వంలో రెండుదఫాలు రూ.18,750 చొప్పున రూ.37,500 వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అందింది. దీంతో వ్యాపారాన్ని అభి వృద్ధి చేసుకుంటూ చిన్న దుకాణాన్ని ఇప్పుడు ఎస్‌ఎంబీ జనరల్ స్టోర్ అండ్ హోల్‌సేల్ దుకాణంగా మార్చా. ఇప్పుడు చిన్న కొట్లకు అవసరమైన సరుకులను నా హోల్‌సేల్ దుకాణం నుంచి అమ్ముతున్నా. ఐదుగురు పిల్లల చదువులు, పెళ్లిళ్ల గురించి ఇప్పుడు దిగుల్లేదు.
పెద్ద కొడుకు కరీముల్లాను ఎంబీఏ దాకా చదివించా. ఇప్పుడు కర్ణాటకలోని కోలార్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరిని టెన్త్‌దాకా చదివించా. ఇంకో అమ్మాయిని డిగ్రీ దాకా చదివించి ముగ్గురికి పెళ్లిళ్లు చేశా. ఇప్పుడు ముగ్గురు కుమార్తెలు అత్తారింట్లో సంతోషంగా ఉన్నారు. చిన్నోడు ఇలియాజ్ డిగ్రీ దాకా చదువుకున్నాడు. నా భర్త మహబూబ్‌బాషా నాకు సాయంగా దుకాణంలో ఉంటున్నారు. రోజుకు రూ.7 వేల దాకా వ్యాపారం నడుస్తోంది. ఈ ప్రభుత్వ పథకాల వల్లే మేం సంతోషంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నాం. – షేక్, నూర్జహాన్ బేగం, ఓంశక్తి ఎస్‌హెచ్‌జీ, కంసాలి వీధి, పలమనేరు, చిత్తూరు జిల్లా (పిచ్చిగుంట్ల సుబ్రమణ్యం, విలేకరి, పలమనేరు)
దిగుల్లేదిక..
మాది నిరుపేద రజక కుటుంబం. నేను, మా ఆయన కలసి ఎంత మంది బట్టలు ఉతికినా కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది. పూట గడవడానికి నానా పాట్లు పడాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ఒక్క కొడుకూ చదువు మానేసి బతుకుదెరువు కోసం ముంబాయి వలస వెళ్లిపోయాడు. ఈ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన నేను నరసింహస్వామి స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిని.
2014 ఏప్రిల్ 11వ తేదీ నాటికి బ్యాంకుకు బకాయి పడిన మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఏడాదికి నాకు రూ.12,800 వంతున మూడేళ్లుగా బ్యాంకు ఖాతాలో జమయింది. దానికి అదనంగా బ్యాంక్ లింకేజీ రుణం లక్ష రూపాయలు తీసుకొని మా ఇంటి వద్దనే కూరగాయల వ్యాపారం ప్రారంభించాను. తాజా కాయగూరలు తెస్తుండటంతో మంచి డిమాండ్ ఉంటోంది.
రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు లాభం వస్తోంది. దానివల్ల నెలవారీ బ్యాంకు లింకేజీ రుణాన్ని తీర్చగలుగుతున్నాను. మా ఆయన నౌపడ బాలరాజు ఇంటి వద్దనే బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. ఆయనకు కూడా జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు వంతున వస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాకే మా తల రాతలు మారి మా కుటుంబమంతా సంతోషంగా ఉంది. దిగుల్లేదిక. – నౌపడ బుడ్డెమ్మ, ఈదుపురం (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్)