
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
జలకళతో వలస తప్పింది
ఊర్లో సరిగా పంటలు పండక బతుకుదెరువు కోసం కుటుంబాన్ని వదిలేసి దేశంకాని దేశం వెళ్లి ఎంతో కష్టపడేవాడిని. మాది వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం పైడికాలువ పంచాయతీలోని సీతోరుపల్లె. నాకు భార్య, ఇద్దరు కుమారులు. మాకు నాలుగున్నర ఎకరాల మెట్ట భూమి ఉంది. వర్షం వస్తేనే పంట పండేది. అదే మాకు జీవనాధారం. పిల్లలు పెద్దవారవుతున్న క్రమంలో ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. వ్యవసాయంలో వరుసగా నష్టాలు రావడంతో చేసేది లేక జీవనోపాధి కోసం భార్యా పిల్లలను వదిలి సింగపూర్‌కు వెళ్లాను. అక్కడ ఐదేళ్లు పని చేశాను.
సింగపూర్‌లో ఉన్న తమిళ స్నేహితులు సోషల్ మీడియా ద్వారా ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి నాకు తెలిపారు. ప్రభుత్వం ప్రజల కోసం అన్ని పథకాలను అమలు చేస్తున్నప్పుడు మనం వలస బతుకులు బతకాల్సిన అవసరం లేదని అనేవారు. మాకు అలాంటి సీఎం ఉంటే మేము ఇప్పటికిప్పుడే మా రాష్ట్రానికి వెళ్లి కుటుంబాలతో కలిసి జీవించే వారమని అనేవారు.
దీంతో నేను సింగపూర్ నుండి 2019 చివర్లో ఇంటికి వచ్చాను. మా గ్రామంలోని గ్రామ సచివాలయంలో వైఎస్‌ఆర్ జలకళ పథకానికి దరఖాస్తు చేశాను. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నా భూమిలో ఉచితంగా బోరు వేయడమే కాక ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ మోటారు, వైరు, పైపులు, స్టార్టర్‌తో సహా ఉచితంగా అమర్చింది. ఇందుకు ప్రభుత్వం మొత్తం రూ. 4,47,061 ఖర్చు చేసింది.
దీంతో సాగు నీటి బాధ తప్పింది. చక్కగా పంటలు పండించుకుంటున్నాము. నాలుగేళ్లుగా రైతు భరోసా కూడా వస్తోంది. పెద్ద కుమారుడు 9, చిన్నోడు 7వ తరగతి చదువుతున్నారు. అమ్మఒడి వస్తోంది. సింగపూర్‌లో నాతో పాటు పని చేసిన ఇతర రాష్ట్రాల వారికి వీడియో కాల్ ద్వారా నేను అప్పుడప్పుడు నా పంట పొలాన్ని చూపిస్తుంటాను. మా రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు ఉంటే బాగుండు అని వారు నిట్టూరుస్తున్నారు. – సీతోరు మల్లికార్జునరెడ్డి, సీతోరుపల్లె (పుత్తా నవనీశ్వరరెడ్డి, విలేకరి, వల్లూరు)
ఒంటరి జీవితానికి గూడు దక్కింది
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం నుంచి 30 ఏళ్ల కిందటే విశాఖపట్నం వచ్చాను. నగరంలోని ఎంవీపీ కాలనీ ఆదర్శనగర్‌లో చిన్న అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాను. వికలాంగుడిని. పెళ్లి అయిన కొన్నాళ్లకే భార్య విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నాను. అప్పుడప్పుడు చెల్లెలు అందించే సహకారంతో జీవనం సాగిస్తున్నాను. విశాఖలో చిన్న ఇల్లు మంజూరు చేయాలని దాదాపు 20 ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నాను.
అయినా ఎవరూ పట్టించుకోలేదు. 2015లో టిడ్కో ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేయడంతో పాటు అప్పుచేసి జీవీఎంసీకి రూ.25 వేలు డిపాజిట్ కూడా చేశాను. అప్పటి ప్రభుత్వం ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేసింది. దీంతో నా ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అయితే 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలోని దబ్బందలో ఇల్లు మంజూరైంది. దశాబ్థాల నా చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. వికలాంగుల పింఛన్ కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. ఇంటికొచ్చి మరీ 1వ తేదీనే రూ.3 వేలు చేతిలో పెడుతున్నారు. ఉన్నంతలో ఆనందంగా జీవిస్తున్నాను.
– కుప్పల రమేష్, ఆదర్శనగర్, విశాఖపట్నం (పలివెల రవీంద్రబాబు, విలేకరి, ఎంవీపీ కాలనీ)
నా పెద్ద కుమారుడు జగన్
నా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమారుల వివాహాలు జరగడంతో వారు వేరుగా కాపురం ఉంటున్నారు. నాకు వితంతు పింఛను మంజూరైంది. గత ప్రభుత్వంలో రూ.200 పింఛను ఇచ్చేవారు. ఆ డబ్బులు దేనికీ సరిపోయేవి కావు. వాటి కోసం బ్యాంకు, పోస్టాఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరిగేదాన్ని. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చాక నా కష్టాలు తీరాయి. ఇప్పుడు పింఛన్ రూ.2,750 ఇస్తున్నారు.
జనవరి నెల నుంచి దానిని రూ.3 వేలకు పెంచుతున్నారు. వలంటీర్ కనకారావు ప్రతి నెల 1వ తేదీ ఉదయమే తలుపుకొట్టి మరీ నా పించను సొమ్ము ఇంటి వద్దనే అందిస్తున్నాడు. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజుపేట. పింఛను సొమ్ముతో సరుకులు, మందులు కొనుగోలు చేసుకుంటున్నా. ప్రతి నెలా ఇంటి ముందుకు వచ్చి ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా నా జీవనానికి పూర్తి స్థాయిలో సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను నా పెద్దకుమారుడిగా భావిస్తున్నా. – చదలవాడ సుశీల, మచిలీపట్నం (పి.అశోక్‌కుమార్, విలేకరి, మచిలీపట్నం టౌన్)