
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఈ ప్రభుత్వమే పెద్ద దిక్కయింది..
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబం మాది. బతుకుదెరువు కోసం అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలంలోని రామానాయక్‌తండా నుంచి తిరుపతికి వెళ్లాం. నా భర్త సర్దార్‌నాయక్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నా భర్తకు అనారోగ్యం చేయడంతో 2012లో సొంత ఊరికి తిరిగి వచ్చేశాం. అప్పటికే మాకు చిన్నపాప ఉంది.
దురదృష్టవశాత్తు 2013లో నా భర్త మృతి చెందాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆ సమయంలో అత్తగారింటిలో ఉన్నా... అత్త, మామ వృద్ధాప్యం కారణంగా ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నారు. వారికి భారం కాకూడదని బిడ్డను చదివించేందుకు కూలి పనులకెళ్లాను. కష్టంగా జీవనం సాగిస్తున్న సమయంలో మా అదృష్టం కొద్దీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చింది. నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి ఓ భరోసా ఇచ్చింది.
నాలుగేళ్లుగా రూ. 15వేలు వంతున నా ఖాతాలో జమవుతోంది. ఇక నిశ్చింతగా పాపను చదివించుకోవచ్చనే ధైర్యం వచ్చింది. అమ్మ ఒడి పుణ్యమాని నా కుమార్తె అంకిత రాయచోటిలోని గురుకుల సంక్షేమ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. అదే లేకుంటే నా బిడ్డ చదువు అర్ధంతరంగా నిలిచిపోయేది. అలాగే నాకు వితంతు పింఛను నాలుగేళ్లుగా వస్తోంది.
డ్వాక్రా గ్రూపులో రుణ మాఫీతో లబ్ధిపొందాను. ఇప్పటికి మూడు విడతల్లో రూ.30 వేలు వచ్చింది. జగనన్న కాలనీలో ఇల్లు కూడా మంజూరైంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం నేను ఓ సంస్థలో ఔట్‌రీచ్ వర్కర్‌గా పనిచేస్తున్నా. సమస్యల్లో ఉన్న మాకు ఈ ప్రభుత్వం మాకు పెద్ద దిక్కయింది. – బి.సావిత్రి, రామానాయక్ తండా, పెద్దమండ్యం మండలం, మదనపల్లె డివిజన్, అన్నమయ్య జిల్లా (మాడా చంద్రమోహన్, విలేకరి, మదనపల్లె సిటీ)
సర్కారు సాయంతో సాఫీగా జీవనం
మాది సాధారణ రైతు కుటుంబం. మా స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దూరు. గ్రామంలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుని జీవనం సాగించేవాడిని. సుమారు 15 ఏళ్ల క్రితం విద్యుత్‌షాక్‌తో కుడికాలు పోయింది. దివ్యాంగుడిని కావడంతో జీవనం కష్టంగా మారింది. పదేళ్లపాటు ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలియాలి. అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం వచ్చాక నా కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.
నాకు దివ్యాంగ పింఛన్ కింద రూ.మూడు వేలు మంజూరైంది. అనంతరం కొద్దినెలల్లో డీఎంహెచ్‌ఓ పింఛన్ రూ.2 వేలు అదనంగా మంజూరుచేశారు. ఇప్పుడు నెలనెలా మొత్తం 5వేల వంతున పింఛన్ అందుతోంది. గతేడాది దివ్యాంగుల కోటాలో మూడుచక్రాల వాహనం(సూ్కటీ) అందజేశారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ. 13,500లు వంతున నాలుగు విడతలుగా అందుతోంది.
నా భార్య తులసి టైలరింగ్ నేర్చుకుని కుట్టుపని ప్రారంభించింది. ఆమెకు వైఎస్సార్ చేదోడు కింద ఇప్పటివరకూ రెండేళ్లకు రూ. 20వేలు అందింది. మా పాప అనంతపురం ఎంపీపీ స్కూలులో 5వ తరగతి, బాబు గుమ్మకోట గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అమ్మఒడి సొమ్ము కూడా వస్తోంది. మొత్తంమ్మీద ఇప్పుడు జీవనం సాఫీగా సాగుతోంది. – కమిడి మల్లేశ్వరరావు, పెద్దూరు, అనంతగిరి మండలం (పెరుమల సుధాకర్, విలేకరి, అనంతగిరి, అల్లూరి సీతారామరాజు జిల్లా)
వృద్ధాప్యంలో సొంతింటి కల నెరవేరింది
మాది పెద్ద కుటుంబం. ఇద్దరు కొడుకులు, కోడళ్లు, మనుమళ్లు, మనుమరాళ్లతో చిన్న ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడేవాళ్లం. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మా స్వగ్రామం. అక్కడ అద్దె ఇల్లు తీసుకుందామంటే మూడు, నాలుగు వేల రూపాయలు భరించడం కష్టంగా ఉండేది. నేను, నా భర్త అల్లస్వామి కూలి పనులకు వెళ్తుండేవాళ్లం.
కూలి డబ్బులతో ఇంటి పోషణ పోగా ఏడాదికి సుమారుగా ఓ రూ.50 వేలు మిగిలేది. ఇది కూడా ఆ ఏడాదంతా కూలి పనులు దొరికితేనే. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. కోడళ్లు, పిల్లలతో ఇల్లు కళకళలాడుతున్నా పాత మిద్దిల్లు కావడంతో ఇరుకుగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక మాబోటోళ్లకు ఇల్లు ఇస్తుందని తెలుసుకుని వలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేశాం. దరఖాస్తు పెట్టుకున్న ఆరు నెలల్లోనే ఇంటి స్థలంతో పాటు, ఇల్లు మంజూరు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలకు తోడుగా మేము దాచుకున్న కొంత సొమ్మును కలిపి జగనన్న కాలనీలో ఇంటిని పూర్తి సౌకర్యాలతో నిర్మించుకున్నాం. వ్యవసాయ కూలీలు కావడంతో మా ఇద్దరు కొడుకులు కుటుంబాలతో ఊళ్లో నివాసం ఉంటుండగా జగనన్న కాలనీలో నేను, నా భర్త నివాసం ఉంటున్నాం. సొంత ఇంట్లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న మాకు సొంతిల్లు నిర్మించి ఇచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – పుట్టపాశం బాలమ్మ, ఓర్వకల్, కర్నూలు జిల్లా. (జి.రాజశేఖరనాయుడు, విలేకరి, కర్నూలు)