ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ప్రభుత్వ సాయం వల్లే ఉన్నత చదువు
నా భర్త తోట గాబ్రియేల్ పాస్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామానికి చెందిన మాకు ముగ్గురు సంతానం. ఇద్దరు పిల్లలకు వివాహాలు చేశాం. మూడో అమ్మాయి ఎవాంజలిన్‌కు ఉన్నత చదువు చదవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదివించలేమని భయంగా ఉండేది.
ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా నా కుమార్తెను రాజానగరం కైట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీ ఫార్మసీలో జాయిన్ చేశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇప్పటి వరకు రూ.68 వేలు వచ్చింది. కేవలం సీఎం జగన్ ఇచ్చిన ఆర్థిక సాయం కారణంగానే నా కూతురు ఉన్నత చదువు చదవగలుగుతోంది. మరో ఏడాది పూర్తయితే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పాస్టర్‌గా ఉన్న నా భర్తకు నెలకు రూ.5 వేలు చొప్పున సంవత్సరానికి రూ.60 వేలు వస్తోంది. సీఎం సహాయం మా కుటుంబానికి ఎంతో తోడ్పాటునిచ్చింది.
– తోట హెప్సిరాణి, కోటనందూరు (ఆలంక కుక్కుటేశ్వరరావు, విలేకరి, కోటనందూరు)
వేట నిషేధంలోనూ నిశ్చింత జీవనం
గంగమ్మ తల్లే మాకు బతుకు తెరువు. ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్నాం. మాలాంటి వారిని ఏ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. క్రమం తప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం పుణ్యమా అని మాకు ఏడాది పొడవునా భుక్తి లభిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన మాకు వేటకు వెళ్తేనే జీవనం గడిచేది. వాతావరణం అనుకూలించకపోయినా.. వేట నిషేధ కాలంలోనూ బతుకు తెరువు కోసం నానా పాట్లు పడేవాళ్లం.
ఈ ఏడాది తొలి సారిగా నాకు ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం కింద రూ.10 వేలు ఆర్థిక సాయం నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమయింది. మత్స్యకారుల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసి 75 శాతం రాయితీతో బోట్లు, వలలు మంజూరు చేస్తోంది. డీజిల్ సబ్సిడీ అందిస్తోంది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే రూ.10 లక్షలు బీమా సౌకర్యం కలి్పస్తోంది. నాకు ముగ్గురు పిల్లలు. అందరూ చదువుకుంటున్నారు. అందులో చిన్నవాడికి అమ్మ ఒడి కింద మూడేళ్లుగా రూ.15 వేలు వంతున వస్తోంది. మా నాన్న చంద్రయ్యకు వైఎస్సార్ పింఛన్ కానుక అందుతోంది. మా తమ్ముడు దివ్యాంగుడు. అతనికి నెలకు రూ.3 వేలు చొప్పున పింఛన్ వస్తోంది. ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాం.
– చీకటి దుర్యోధన, డొంకూరు (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్)
కలలో కూడా ఊహించని సాయం
మేము బతుకు తెరువు కోసం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం నుంచి విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. భర్త సూర్యనారాయణ సైట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిన్నర క్రితం నాకు గుండెలో భారంగా ఉండడంతో తనిఖీ చేయించుకోగా వాల్వ్ మూసుకు పోయిందని డాక్టర్లు తెలిపారు. నా నెత్తిన పిడుగు పడినట్టయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స చేస్తారని తెలిసి కొండంత ధైర్యం వచ్చింది.
నా కుమారుడితో కలిసి విజయనగరం పెద్దాస్పత్రికి వెళ్లాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తూ మందులు ఇస్తున్నారు. ఇంతవరకు మందులతో నెట్టుకొచ్చాను. ఇక ఆపరేషన్ తప్పనిసరని, లేకుంటే ప్రాణాలకు ముప్పని గుండె డాక్టర్ చెప్పడంతో మూడు వారాల కిందట విశాఖపట్నంలో కార్పొరేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చయ్యే బైపాస్ సర్జరీని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తారట. కోలుకునే వరకు నెలకు రూ.5 వేల వంతున ఆర్థిక సాయం కూడా చేస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆసరా కింద మూడు విడతలుగా రూ.56,250, సున్నా వడ్డీ కింద రూ.50 వేలు ఆర్థిక సాయం అందింది.
నా కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండడంతో మా కోడలు లావణ్య తగరపువలసలోని కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఉచితంగా చదువుతోంది. నా భర్తకు గతేడాది ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ప్రస్తుతం నలుగురం కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాము. గత ప్రభుత్వ హయాంలో ఇంటి కోసం అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం నుంచి ఇంతగా సాయం అందుతుందని కలలో కూడా మేము ఊహించలేదు.
– కోరాడ జ్యోతి, వేములవలస (మహాంతి శివాజీ, విలేకరి, ఆనందపురం)
Comments
Please login to add a commentAdd a comment