ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
చేనేతల బతుకులు ఇప్పుడు ఆనందమయం
చేనేతే మా జీవనం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం శివపురం గ్రామంలో మాకు ఓ మగ్గం ఉంది. దానిపై చీరలు వంటివి నేస్తాం. నేను రోజంతా కష్టపడినా ఆశించిన ఫలితం ఉండేది కాదు. పైగా నూలు, ముడిసరుకులు కొనుగోలు చేయడానికి తప్పనిసరిగా అప్పు చేయాల్సి వచ్చేది. నేసిన సరుకు అమ్ముడయ్యాక అప్పులు తీర్చేవాళ్లం. దానికోసం నానా కష్టాలుపడేవాళ్లం. నాలుగేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మా జీవితాలలో వెలుగులు వచ్చాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఈ ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా రూ. 24 వేలు వంతున ఇచ్చింది.
ఆ మొత్తంతో చీరలు నేసేందుకు అవసరమైన నూలు, ముడిసరుకులు కొనుగోలుకు అప్పులు చేసే బాధ తప్పింది. గతేడాది ప్రభుత్వం మాపై దయచూపి మగ్గంపని చేయటానికి అవసరమైన కరెంటు మోటారును సబ్సిడీపై ఇచ్చింది. మోటారు విలువ రూ.18వేలు కాగా అందులో 90శాతం సబ్సిడీ పోను రూ. 1800లు మాత్రం మా వాటాగా చెల్లించి మోటారు తెచ్చుకొన్నాం.
అప్పటి నుంచి మగ్గం నేసే పని చాలా సులభతరంగా మారింది. ఇప్పుడు శారీరక శ్రమ తగ్గింది. నా పెద్దకుమార్తె అమృత డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె గౌతమి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమెకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఏడాదికి రూ.75 వేల చొప్పున రెండేళ్లకు రూ. లక్షా 50 వేలు అందించింది. నా భార్య గతంలో తీసుకున్న డ్వాక్రా రుణ మాఫీకి సంబంధించి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకూ రూ.40 వేలు అందించింది. జగనన్న ఇళ్ల కాలనీలో స్థలం మంజూరు చేయడంతోపాటు ఆర్థిక సాయం చేయడంతో ఇల్లు కట్టుకున్నాం. గత ప్రభుత్వంలో మేము ఎన్నడూ ఇలాంటి సాయం పొందలేదు. జగనన్నకు మేం రుణపడి ఉంటాము.
– ఎస్.మోహన్, శివపురం. గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లా (కొందేటి మురళీకృష్ణ. విలేకరి, గుర్రంకొండ)
ఏ దిక్కూ లేని నన్ను ప్రభుత్వమే ఆదుకుంది
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేము 30 సంవత్సరాల క్రితం బతుకుతెరువు నిమిత్తం నా భర్త, కుమార్తె, కుమారుడితో కలసి విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం, బాలచెరువుకు వచ్చేశాం. నా భర్త చిన్న చిన్న కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే విధి మా కుటుంబంపై చిన్న చూపుచూసింది. మా కుటుంబానికి ఆధారమైన నా భర్త సుమారు 20 ఏళ్ల కిందటే మరణించారు. ఆ దుఖంలో ఉండగానే నా పిల్లలు ఇద్దరూ అనారోగ్య సమస్యలతో ఒకరి తరువాత ఒకరు కన్నుమూశారు. మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వారికి ఖరీదైన వైద్యం చేయించలేక భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నాను.
ఒంటరిగా మిగిలిన నేను గంగవరం పోర్టులో కూలి పనులకు వెళ్లేదాన్ని. వయసు పైబడడంతో అక్కడ పని నుంచి నన్ను తీసేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా కనీసం నాకు పింఛన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నా వయసు 73 ఏళ్లు. దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు ఈ ప్రభుత్వం వచ్చాక ఒంటరి మహిళ పింఛన్ మంజూరైంది. నాలుగేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ పింఛన్ అందజేస్తున్నారు. ఆ పెన్షనే నాకు జీవనాధారం. రేషన్ కార్డు ఉండడంతో ఉచితంగా బియ్యం ఇస్తున్నారు.
డబ్బుల కోసం ఇప్పుడు ఎవరి దగ్గరా చేయి చాచడం లేదు. సంతోషంగా ఉన్నాను. నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి. ఇక్కడే ఒక చిన్న రేకుల షెడ్డులో అద్దెకు ఉంటున్నాను. నా ఒక్కదాని కోసం ఎందుకని జగనన్న ఇంటి కోసం దరఖాస్తు చేయలేదు. ఈ ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మలో మరచిపోలేను.
– కోడ సీతమ్మ, బాలచెరువు, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా (ముప్పిడి శ్రీనివాసరావు, విలేకరి, పెదగంట్యాడ)
సర్కారు సాయంతో హాయిగా జీవనం
మాది మధ్య దిగువ తరగతి కుటుంబం. నేను, మా ఆయన శ్రీవెంకట కడియార్ కలసి ఏలూరులో కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మా బిడ్డను ఉన్నత చదువులు చదివించాలనేది మా కోరిక. కానీ అంతటి ఆర్థిక స్తోమత మాకు లేదు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లల చదువుకు ఇక బెంగ తీరిపోయింది. మా అమ్మాయి ప్రస్తుతం తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అమ్మ ఒడి ద్వారా మాకు ప్రతి ఏటా రూ. 15వేలు వంతున అందుతోంది.
ఆ మొత్తంతో బిడ్డ చదువుకోవడానికి ఏం కావాలన్నా సమకూర్చ గలుగుతున్నాం. బడిలో యూనిఫాం ఇస్తున్నారు, షూ, టై, స్కూల్ బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇలా అన్ని అవసరాలనూ ప్రభుత్వమే తీర్చుతోంది. మధ్యాహ్న భోజనం కూడా రుచిగా వడ్డిస్తున్న కారణంగా ఇంటి నుంచి భోజనం పట్టుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. డ్వాక్రా రుణమాఫీ(వైఎస్సార్ ఆసరా) ద్వారా గత నాలుగేళ్లలో రూ.14,500లు నా ఖాతాలో జమయ్యాయి. మాకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500లు చొప్పున వచ్చింది. జగనన్నకు మా కుటుంబం మొత్తం జీవితాంతం రుణపడి ఉంటాం. – గంగుల నాగదుర్గ, ఏలూరు (సీహెచ్‌ఆర్‌కే రాజు, విలేకరి ఏలూరు)
Comments
Please login to add a commentAdd a comment