ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
కిరాణా దుకాణంతో బతుకు మారింది
ఉ న్న ఊళ్లో ఉపాధి లేక మా ఆయన వెంకటరావు విశాఖలో వివిధ పనులు చేసేవారు. రోజూ మేముండే భీమిలి మండలం నగరంపాలెం నుంచి అక్కడికి వెళ్లి వచ్చేందుకు ఇబ్బందిగా ఉండేది. అత్తా, మామ ఇద్దరు ఆడ పిల్లలు కలిపి ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులం ఉండేవాళ్లం. పిల్లల ఫీజులు, రవాణా చార్జీలు కాకుండా ఇంటి ఖర్చు నెలకు కనీసం రూ.15 వేలయ్యేది.
ఇద్దరు పిల్లలను తగరపువలసలోని ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్నాం. ఈ ఖర్చులు మాకు భారంగా అనిపించేవి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత నా భర్తకు మా పంచాయతీలోనే వలంటీర్‌గా అవకాశం వచ్చింది. 3వ తరగతి చదువుతున్న పెద్దమ్మాయి తపస్వికి మూడేళ్లుగా అమ్మ ఒడి కింద రూ.15 వేల వంతున వస్తోంది. చిన్న పాప తేజ ఒకటో తరగతి చదువుతోంది.
మా మామ పల్లా రాముకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా అత్తగారు రాములమ్మకు నాలుగేళ్లుగా వైఎస్సార్ చేయూత కింద రూ.18,750లు వంతున, వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు రూ.25వేలు వచ్చింది. నాలుగేళ్లలో వచి్చన ఈ లబి్ధతో రూ.1.50 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఇంటి ముందు కిరాణా దుకాణం తెరిచాను. ఖాళీ సమయంలో టైలరింగ్ చేస్తాను. రోజుకు ఖర్చులన్నీ పోను ఇంటి వద్దే రూ.వెయ్యి వరకు ఆదాయం సమకూరుతోంది. నా భర్త ఖాళీ సమయంలో తగరపువలస నుంచి సామాన్లు తీసుకువచ్చి షాపులో వేస్తారు. ఒకరి వద్ద పనిచేయకుండానే హాయిగా గడచిపోతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదు. – పల్లా కృష్ణవేణి, టి.నగరపాలెం, భీమిలి మండలం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస)
ఇప్పుడు సొంతిల్లు సమకూర్చుకున్నాం
మాది చిన్నపాటి కిరాణా దుకాణం. నెలకు అయిదు నుంచి ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుంది. నా భర్త విజయకృష్ణ కుమార్, నేనూ ఈ దుకాణంలో ఉంటాం. రెండెకరాల భూమి ఉంది. ఇందులో రేగుపంట వేస్తాం. వర్షాలు పడితేనే పంట పండుతుంది. బాగా పండితే ఏడాదికి సుమారు 20వేల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ఈ మొత్తం మా కుటుంబ పోషణకే సరిపోయేది కాదు.
ఇద్దరు ఆడపిల్లలు ఉషశ్రీ, కావ్యశ్రీలను చదివించాలి. ఈ పరిస్థితుల్లో మాకు సొంతిల్లు అనేది కలలో కూడా ఊహించుకోలేకపోయాం. కానీ అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం రావడంతో వారి సహకారంతో ఆ కోరిక తీర్చుకోగలిగాం. అంతేనా... మా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చదివించుకోగలిగాం. పెద్దమ్మాయికి ఫైనల్ ఇయర్‌కు, చిన్నమ్మాయికి నాలుగేళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడంతో ఇద్దరి చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరారు.
జగనన్న కాలనీలో మాకు స్థలం మంజూరు కావడంతోపాటు, ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80లక్షలు మంజూరు చేశారు. సబ్సిడీ ధరలకే ఇంటి నిర్మాణ సామగ్రి అందివ్వడంతో మేము కొంత డబ్బు జతచేసి పక్కా ఇంటిని నిర్మించుకోగలిగాం. ఇన్నాళ్లకు సొంతింటికల నెరవేరడంతో మేము ఆనందంగా ఉన్నాం. మాకున్న పంట పొలంపై వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500లు లభిస్తోంది. వైఎస్సార్ సున్నావడ్డీ కింద సుమారు రూ. 50వేలు నా ఖాతాలో జమయ్యింది. మా అత్త గారు వరలచ్చమ్మకు ప్రతి నెల పింఛన్ అందుతోంది. ఇప్పుడు మేము ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవనం సాగిస్తున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం చలువే. – జక్కా రాధాదేవి, ఇల్లూరు కొత్తపేట, బనగానపల్లె మండలం (జి.సర్వేశ్వర్ రెడ్డి, విలేకరి, బనగానపల్లె)
ఒంటరి జీవితానికి కొండంత భరోసా
మాది పేద కుటుంబం. నేను, మా ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో కష్టపడి పనిచేస్తేనే జీవితం సాగేది. దురదృష్టవశాత్తూ నా భర్త గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. దాంతో నేను ఒంటరిదానిగా మారాను. రోజువారి కూలీ నాకు ఏమాత్రం సరిపోయేది కాదు. జీవనం కష్టంగా మారింది. ఇటీవల వితంతు పెన్షన్ మంజూరైంది.
ప్రతి నెలా ఆ మొత్తం నన్నెంతగానో ఆదుకుంటోంది. అంతేగాకుండా మూడేళ్ల నుంచి కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సాయంతో బతుకు సాఫీగా సాగుతోంది. రేషన్ కార్డు ఉండటంతో బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు నా ఒంటరి జీవితానికి ఇంక భయం లేకుండా పోయింది. – పేరాబత్తుల రామలక్ష్మి, పెదపట్నం లంక, మామిడికుదురు మండలం (యేడిద బాలకృష్ణారావు, విలేకరి, మామిడికుదురు)
Comments
Please login to add a commentAdd a comment