బాపట్ల
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
● బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు నుంచి గ్రానైట్ పలకలు ఎగుమతి
● జీరో బిల్లులతో రోజుకు 110 లారీల తరలింపు
● లారీకి రూ.32 వేలు వసూలు చేస్తున్న పచ్చ నేతలు
● చెక్‌పోస్టు నిర్వహణ కంపెనీకి రూ.16 వేలు, దందా నిర్వాహకులకు రూ.16 వేలు
● తెర వెనుక, ముందు పచ్చనేతలు...
● నెలకు రూ.10.56 కోట్ల వసూలు
● ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్ను ఎగవేత
సాక్షి ప్రతినిధి,బాపట్ల: అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాల నుంచి గ్రానైట్ పాలీషింగ్ పలకలు అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి సేల్స్‌టాక్స్, మైనింగ్ టాక్స్ చెల్లించకుండానే జీరోలో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తరలిస్తున్నారు. పై రెండు మండలాల నుంచే రోజుకు 40 నుంచి 50 లారీలు తరలి పోతున్నాయి. ఓ మంత్రి ప్రధాన అనుచరుడు ఈ అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమరవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ మాత్రం అనధికారికంగా ఆ బాధ్యతలను పచ్చనేతల చేతుల్లో పెట్టి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. జీరోలో పలకలు తరలించాలనుకునే వ్యాపారుల వద్ద లారీకి రూ.32 వేలు కప్పం కట్టించుకొని చెక్ పోస్టుకంపెనీ పేరున స్లిప్పులు ఇస్తున్నట్లు సమాచారం.
జోడీ కుదిరింది.. స్పీడు పెరిగింది
కూటమి అధికారంలోకి వచ్చిన ప్రారంభం నుంచి మార్టూరుకు చెందిన వ్యాపారులు పర్చూరు నియోజకవర్గ పచ్చనేతకు కప్పం కట్టి జీరోలో గ్రానైట్ పలకలు ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. మార్టూరు నుంచి రోజుకు సుమారు 70కి పైగా లారీలు ఈ తరహాలో అక్రమ రవాణా సాగించేవి. ప్రారంభంలో లారీకి రూ.28 వేలు కప్పం కట్టించుకునేవారు. ఆ తర్వాత మంత్రి నియోజకవర్గం నుంచి గ్రానైట్ పలకలు ఎగుమతి అవుతుండటంతో మంత్రి ప్రధాన అనుచరుడికి ఈ జీరో వ్యాపారంపై కన్నుపడింది. పర్చూరు పచ్చనేతతో మిలాఖత్ అయ్యారు. అప్పటికే ఈ వ్యవహారంలో ఆరితేరిన మార్టూరుకు చెందిన వ్యక్తికి దందాను అప్పగించారు. ప్రస్తుతం అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలనుంచి రోజుకు 110 లారీల గ్రానైట్ పలకలు అక్రమంగా ఇతర రాష్ట్రాలు, అక్కడినుంచి ఇతర దేశాలకు తరలిస్తున్నారు.
ప్రభుత్వ రాబడికి గండి ...
అక్రమంగా గ్రానైట్ తరలిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిషింగ్ పలకలకు సేల్స్‌టాక్స్ రూ.1300, మైనింగ్ టాక్స్ రూ.700 చొప్పున మొత్తం రూ. 2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన జీరోలో వెళ్లే 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్ చెల్లించాలి. రోజుకు 110 లారీలకు అనుకుంటే రూ.77 లక్షలు, ఆ ప్రకారం నెలకు రూ.23.10 కోట్లు టాక్స్‌లు చెల్లించాల్సి ఉంది. కానీ వ్యాపారులు ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా అక్రమ మార్గంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోతున్నారు.
న్యూస్‌రీల్
నెలకు రూ.కోట్లలోనే రాబడి..
ఒక్కోలారీలో 35 టన్నులకు తగ్గకుండా గ్రానైట్ పలకలను తరలిస్తారు. ఇందుకోసం దందా నిర్వాహకులు లారీకి రూ.32 వేలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు 110 లారీలకు రూ.35,20,000, నెలకు రూ.10,56,60,000 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో చెక్‌పోస్టుల కాంట్రాక్ట్ నిర్వాహకులకు లారీకి రూ.16 వేలు చొప్పున చెల్లించి మిగిలిన దాంట్లో చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల పచ్చనేతలకు వాటాలు పంచుతున్నట్లు సమాచారం. వారితోపాటు అటు మైనింగ్, పోలీసు, విజిలెన్స్ తదితర అధికారులకు సైతం నెలకు కొంతమొత్తం చెల్లిస్తున్నట్లు వినికిడి. మిగిలిన మొత్తాన్ని పర్చూరు నేత, మంత్రి అనుచరుడు వాటాలుగా పంచుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment