కూలిన సాగు ఆశలు!
● వెల్లటూరు ఛానల్ బీఎం డ్రెయిన్‌పై చప్టా కూలిన నేపథ్యంలో రబీసాగుకు ఆటంకం ● ఆందోళనలో రైతాంగం ● తాత్కాలిక మరమ్మతులు చేసి దిగువకు సాగునీరు వదులుతామంటున్న అధికారులు
భట్టిప్రోలు: వెల్లటూరు ఛానల్‌పై భట్టిప్రోలు సమీపంలోని కూలిపోయిన చప్టాకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి సాగునీరు పారుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఇరిగేషన్ శాఖ సన్నాహాలు చేస్తుంది. వెల్లటూరు ఛానల్ బీఎం డ్రెయిన్‌లో చప్టా కూలిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. సుమారు 30 వేల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీరు విడుదల అవుతుంది. అధికారులు మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ నెల రోజులపాటు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తక్కువ మోతాదులో సాగునీరు దిగువకు విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు.
అయోమయ స్థితిలో అన్నదాతలు..
బ్రిటిష్ కాలంలో నిర్మించిన వెల్లటూరు ఛానల్ ధ్వంసం కావడంతో రైతులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ చప్టా వద్ద 20 ఏళ్ల క్రితం పగుళ్లు రావడంతో అధికారులు మసిపూసి మారేడుకాయ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. చప్టా కూలిపోతోందనే విషయం అధికారులకు ముందే తెలుసని, తెలిసీ నిర్లక్ష్యం వహించారని రైతులు మండిపడుతున్నారు. ఇది ఇలాఉండగా చప్టా పరిస్థితిని అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసి వెళుతున్నారే తమకు ఎటువంటి భరోసా కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకోవాలంటే బీఎం డ్రెయిన్ పై నుంచి 16వ కి.మీ వద్ద ఉన్న రేపల్లె మెయిన్ డ్రెయిన్ నుంచి నీటిని మోటార్ల ద్వారా 23వ కి.మీ చివర వరకు సాగు నీరు అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని రైతులు సూచిస్తున్నారు.
రెండు మూడు రోజుల్లో దిగువకు సాగునీరు..
ప్రస్తుతం వెల్లటూరు లాకుల వద్ద సాగు నీటిని తగ్గించి చప్టా వద్ద ఓ పక్క విరిగిన ప్రాంతంలోని శిథిలాలను పొక్లెయినర్‌తో తొలగించడం జరుగుతుంది. ఇసుక మూటలను అడ్డుగా వేసి మందపాటి టార్ఫాలిన్ పట్టలు వేసి ఆ పట్టలు కొట్టుకుపోకుండా పటిష్ట పరచి తగు మోతాదులో దిగువకు సాగునీరు అందించేవిధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే చప్టా వద్దకు వెళ్లేందుకు పొక్లెయిన్‌ను సిద్ధం చేశాం. రెండు మూడు రోజుల్లో పని పూర్తి చేసి సాగు నీరును దిగువకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
–వెంకటరత్నం,
ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment