సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
బాపట్ల: ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్‌కు అర్జీల రూపంలో సమస్యలు విన్నవించారు. తన పరిధిలోని వాటికి ఆయన సత్వరమే పరిష్కార మార్గం చూపారు. మిగిలిన వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. గృహాల జియో ట్యాగింగ్ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని హెచ్చరించారు. ఆయా గ్రామాలలో లక్ష్యం మేరకు రీ సర్వే పూర్తి చేయాలని ఆన్‌లైన్ ద్వారా జేసీ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అధికారులతో స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ భారత రాజ్యాంగం పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఈనెల 26వ తేదీన రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా బాపట్లలో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ఆర్డీఓ పి.గ్లోరియా, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరణ
జన గణనతో పాటు కులగణన చేపట్టాలి..
ప్రజల అభ్యున్నతితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరపాలి. అప్పుడే అన్నివర్గాలకు సమన్యాయం జరిగి మేలు జరుగుతుంది. దిగువ వర్గాలకు సైతం ప్రభుత్వ పథకాలు చేరగలుగుతాయి. ఈమేరకు జిల్లా కలెక్టర్ వెంకట మురళీకృష్ణను కలిసి బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశాం.
– మద్దిబోయిన తాతయ్య,
బీసీ సంక్షేమ సంఘం నేత
వరద నిధుల ఖర్చుల
వివరాలు ఇవ్వడం లేదు..
విజయవాడ, బాపట్లలో ఇటీల సంభవించిన వరదలలో ఖర్చు పెట్టిన వాటి వివరాలను కోరినప్పటికీ మున్సిపల్ అధికారులు ఇవ్వటంలేదు. 65రోజులుగా వివరాలు ఇవ్వాలని ఆర్‌టీఐ యాక్టు ద్వారా కోరినప్పటికీ సమాచారం ఇవ్వటంలేదు. వెంటనే వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించాను.
–జోగి రాజా, బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment