● నేడు ఉమ్మడి జిల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్ష ● హాజరుకానున్న 4,434 మంది విద్యార్థులు ● 11నుంచి 1–30గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతి | Sakshi
Sakshi News home page

● నేడు ఉమ్మడి జిల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్ష ● హాజరుకానున్న 4,434 మంది విద్యార్థులు ● 11నుంచి 1–30గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతి

Published Sun, May 5 2024 1:15 AM

-

ఖమ్మం సహకారనగర్‌/పాల్వంచ: దేశవ్యాప్తంగా 2024–25వ విద్యాసంవత్సరానికి వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్టు)కు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం జరిగే ఈ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఖమ్మంలోని హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఎస్‌వీఎంసెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌, మ్యాక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, బ్లూమింగ్‌ మైండ్స్‌ సెంట్రల్‌ స్కూల్స్‌, రఘునాథపాలెం సమీపాన ఎస్‌ఈఎస్‌ వీ.వీ.సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌తో పాటు కొత్తగూడెంలోని సింగరేణి డిగ్రీ, పీజీ కళాశాల, పాల్వంచలోని నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పరీక్ష జరగనుంది. ఈమేరకు ఖమ్మం జిల్లాలోని కేంద్రాల్లో 3,260మంది, భద్రాద్రి జిల్లాలోని కేంద్రాల్లో 1,174మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

2గంటల నుంచి పరీక్ష

నిర్ణీత కేంద్రాల్లో నీట్‌ ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి 5–20గంటల వరకు జరుగుతుంది. అయితే, విద్యార్థులను మాత్రం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రతీ విద్యార్థిని తనిఖీ చేయాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, 1.30తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదని పరీక్షల ఖమ్మం, కొత్తగూడెం కోఆర్డినేటర్లు ఆర్‌.పార్వతీరెడ్డి, ఎం.వీ.ఎస్‌ రెడ్డి వెల్లడించారు.

హాఫ్‌ హ్యాండ్‌ చొక్కా తప్పనిసరి

విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావొద్దు. అలాగే, ఆభరణాలు కూడా ధరించి రావొద్దు. హాఫ్‌ హ్యాండ్స్‌ షర్ట్స్‌ మాత్రమే ధరించాలి. బూట్లు కాకుండా స్లిప్పర్లు మాత్రమే వేసుకునిరావాలి. కేంద్రాల్లో నిర్వాహకులే పెన్నులు ఇస్తారు. విద్యార్థులు వ్యక్తిగతంగా వాటర్‌ బాటిల్‌తో పాటు అడ్మిట్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు తీసుకురావాలి. అలాగే, డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రొఫార్మాపై ఒక ఫొటో అతికించుకుని పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement