వ్యయ వివరాలు నమోదు చేయాలి | Sakshi
Sakshi News home page

వ్యయ వివరాలు నమోదు చేయాలి

Published Tue, May 7 2024 4:45 AM

వ్యయ వివరాలు నమోదు చేయాలి

● పోటీచేసే అభ్యర్థుల ప్రతీ పైసాకు లెక్క ఉండాల్సిందే ● సీజ్‌ చేసిన నగదు వివరాలు నమోదు ● కలెక్టర్‌ ప్రియాంక ఆల వెల్లడి

భద్రాచలం: పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్‌ ప్రియాంక ఆల సిబ్బందికి సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఎన్నికల అకౌంటింగ్‌ టీమ్‌ ఆఫీసులో రికార్డులు పరిశీలించారు. సీజ్‌ చేసిన నగదు, రిలీజ్‌ వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, ప్రచారం, ఇతర ఖర్చులకు సంబంధించి రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. అనుమతి తీసుకున్న వాహనాల కంటే ఎక్కువ ఉంటే వాటి అనుమతిని రద్దు చేయాలని ఆదేశించారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల్లో జారీ అయ్యే ప్రకటనల ధరల ఆధారంగా అభ్యర్థి ఖర్చులో జమ చేయాలన్నారు. అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో అకౌంటింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. సెలవు రోజుల్లో కూడా నిరంతర నిఘా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. వాహనాల తనిఖీల్లో పట్టబడిన నగదు, ఇతర సమాచారాన్ని నిర్దిష్ట ఫార్మాట్‌లలో రోజువారీగా తనకు పంపించాలని సూచించారు.

ఈవీఎంలతో సర్వం సిద్ధం

మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌లో 176 పోలింగ్‌ స్టేషన్లలలో ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలతో సహా అన్నీ సిద్ధం చేశామని ప్రియాంక ఆల అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలను ఆము పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేసి, సెక్టార్ల వారీగా ఈవీఎం కమిషనింగ్‌ చేశామని, స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచామని తెలిపారు. సెక్టోరియల్‌ అధికారులు, పీఓలు, ఏపీఓలు, సపోర్టింగ్‌ సిబ్బంది పోలింగ్‌కు ముందు రోజు ఈవీఎం మిషన్లను తీసుకెళ్లాలని, ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే తెరవాలని ఆదేశించారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లు, పోలీసుల రక్షణలో 24 గంటల పహారా, సీసీ కెమెరాల నిఘాతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ఏఆర్‌ఓ దామోదర్‌ రావు, అసిస్టెంట్‌ వ్యయ ఖర్చుల పరిశీలకులు వేల్పుల శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎస్సై విజయలక్ష్మి, సీసీ రామ్‌ నాయక్‌, అకౌంటింగ్‌ టీం సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల కమిషనింగ్‌ పరిశీలన

కొత్తగూడెంరూరల్‌: లక్ష్మీదేవిపల్లి మండలంలోని రామచంద్ర డిగ్రీ కాలేజీలో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ ప్రియాంక ఆల సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అత్యంత పకడ్బందీగా ఈవీఎం కమిషనింగ్‌ ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో ఈవీఎం కమిషనింగ్‌కు ఎంత సమయం పడుతుంది, ఎంత మంది సిబ్బందిని కేటాయించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్య ఎదురైతే టెక్నికల్‌ సిబ్బంది, మాస్టర్‌ ట్రైనర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్‌ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement