అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులకు సూచించారు. స్థానిక ఐడీఓసీలో గురువారం ఎస్పీ రోహిత్‌రాజ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారం ఉన్న హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని చెప్పారు. వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించాలన్నారు.33 శాతం సబ్సిడీతో వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరగా.. ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉంటుందని, జిల్లా జడ్జికి వినతిపత్రం అందిస్తామని కలెక్టర్ వివరించారు. జిల్లా ఏర్పాటు సమయంలో అప్పటి కలెక్టర్ చుంచుపల్లిలో సేవాలాల్ ధ్యాన మందిరం ఏర్పాటుకు స్థలం కేటాయించారని, కానీ ఇప్పటివరకు కార్యాచరణ రూపొందించలేదని సభ్యులు కలెక్టర్ దృష్టికి తేగా.. పరిశీలించాలని చుంచుపల్లి తహసీల్దార్‌ను ఆదేశించారు. సమావేశంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఐటీడీఏఈ ఏపీఓ జనరల్ డేవిడ్రాజు, బీసీ సంక్షేమాధికారి అనసూయ, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏఓ రమాదేవి, ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు ఎనుమురి లక్ష్మీబాయి, చింతల రవికుమార్, లావుడియా సామ్య, లకావత్ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment