హోరెత్తుతున్న ప్రచారం | - | Sakshi
Sakshi News home page

హోరెత్తుతున్న ప్రచారం

Published Wed, Jan 29 2025 12:50 AM | Last Updated on Wed, Jan 29 2025 12:50 AM

హోరెత్తుతున్న ప్రచారం

హోరెత్తుతున్న ప్రచారం

● ఈనెల 31న ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్మిక సంఘాలు ● విందు రాజకీయాలకు రూ.లక్షల్లో ఖర్చు ● సాధారణ ఎన్నికలను మించిన సందడి

బూర్గంపాడు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద పేపర్‌ పరిశ్రమ అయిన సారపాక ఐటీసీ పీఎస్‌పీడీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈనెల 31న జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం ట్రేడ్‌ యూనియన్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. బరిలో ఉన్న ట్రేడ్‌ యూనియన్ల ప్రచార హోరుతో సారపాక, భద్రాచలం, బూర్గంపాడు, నాగినేనిప్రోలు, మోరంపల్లిబంజర, లక్ష్మీపురం, మోతె, ఇరవెండి ప్రాంతాల్లో సాధారణ ఎన్నికలను మించిన సందడి కనిపిస్తోంది. ఐటీసీ యాజమాన్యంతో 14వ వేతన ఒప్పందం నేపథ్యంలో ఈ ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఐటీసీ పీఎస్‌పీడీలో పనిచేస్తున్న 1,178 మంది పర్మనెంట్‌ కార్మికులు, 82 మంది బదిలీ వర్కర్లు మొత్తం 1,260 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. పరిశ్రమలో పని చేసే సుమారు 9 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు, 600 మందికి పైగా మేనేజర్లకు ఓటు హక్కు లేదు. కాగా, 1260 మంది ఓట్ల కోసం బరిలో ఉండే కార్మిక సంఘాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. గత నెల పదిహేను రోజులుగా ఎన్నికల ప్రచారం కోసం రూ.లక్షలు వెచ్చించిన ట్రేడ్‌ యూనియన్లు.. ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఓటర్లకు విచ్చలవిడిగా విందులు, తాయిలాలు ఇస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కార్మిక సంఘాలు మొత్తంగా రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. యూనియన్లకు మద్దతుగా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటున్నారు.

త్రిముఖ పోటీ..!

ఐటీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఆర్‌టీయూ, బీఎంఎస్‌, ఏఐటీయూసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఆర్‌టీయూ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి ఓట్ల మెజారిటీనే అని ప్రచారం సాగుతోంది. దీంతో ఈ మూడు యూనియన్‌లు వ్యూహాలకు పదును పెట్టి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్‌ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఈ విమర్శలు తీవ్రస్థాయికి చేరుతుండడంతో గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కార్మిక, పోలీస్‌ శాఖలతో పాటు ఐటీసీ యాజమాన్యం సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ట్రేడ్‌ యూనియన్లు, అనుబంధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ఈనెల 30, 31 తేదీల్లో బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేసే ఆలోచనలో పోలీస్‌ శాఖ ఉంది.

నగదు.. నజరానా..

నిన్నటి వరకు విందు, మందు రాజకీయాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా ఖర్చు చేసిన కార్మిక సంఘాల నాయకులు ఇప్పుడు ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు భారీగా నగదు, నజరానాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో న్యూట్రల్‌గా ఉండే ఓటర్లకే ట్రేడ్‌ యూనియన్‌లు ఎంతో కొంతో ముట్టజేప్పేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రోజూ తమవెంట ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న నాయకులకు, కార్యకర్తలకు కూడా భారీగానే నగదు, నజరానాలు ఇవ్వాల్సి వస్తోంది. లేదంటే ప్రత్యర్థి యూనియన్‌ల నాయకులు రహస్యంగా ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి ప్రమాణాలు చేయించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రేడ్‌ యూనియన్ల నాయకులకు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో అర్థం కావడం లేదు. ఈ ఎన్నికలలో ఓటుకు రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు డిమాండ్‌ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement