హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ ఈ ఏడాది కొత్తగా దాదాపు 3 కోట్ల మంది యూజర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది 9 కోట్లుగా ఉందని, దీన్ని సుమారు 12 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఐటెల్ మాతృసంస్థ ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజిత్ తాలపత్ర తెలిపారు. తాజాగా అధిక సామర్థ్యాలు గల ఎ60, పీ40 స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టడం, బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ను నియమించుకోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యాపార విస్తరణ క్రమంలో టీవీలు, ట్యాబ్లెట్లు వంటి విభాగాల్లోకి కూడా ప్రవేశించినట్లు వివరించారు. 5జీ సేవల విస్తరణ నేపథ్యంలో తాము కూడా ఈ ఏడాది మూడు లేదా నాలుగో త్రైమాసికం నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అరిజిత్ చెప్పారు. దీని ధర రూ. 10 వేల లోపే ఉంటుందని పేర్కొన్నారు.
మేడిన్ ఇండియాపై మరింతగా దృష్టి.: ఫీచర్ ఫోన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లను అందించడంపైనా.. దేశీయంగా తయారీపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నామని అరిజిత్ చెప్పారు. దేశీయంగానే లభ్యమయ్యే పరికరాలు, విడిభాగాలను కొనుగోలు చేయడాన్ని పెంచుకుంటున్నట్లు వివరించారు. నోయిడాలో తమకు మూడు తయారీ ప్లాంట్లు ఉన్నాయని, వీటిలో దాదాపు 4,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అరిజిత్ చెప్పారు. కోవిడ్‌పరమైన సవాళ్ల కారణంగా కొంతకాలం సెమీకండక్టర్ల కొరత నెలకొన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం రూ. 10 వేల లోపు ఫోన్ల సెగ్మెంట్లో తమకు 25 శాతం పైగా మార్కెట్ వాటా ఉందన్నారు. మొత్తం స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి రూ. 8 వేల లోపు విభాగంలో తాము 12% వాటా దక్కించుకున్నామని అరిజిత్ చెప్పారు. తమ ఆదాయాల్లో దక్షిణాది మార్కెట్ వాటా 20% ఉంటుందని ఆయన చెప్పారు. ట్రాన్షన్ సంస్థ ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో బ్రాండ్ల పేరిట మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది.
కొత్తగా 3 కోట్ల యూజర్లు లక్ష్యం
Published Sat, Apr 8 2023 6:20 AM | Last Updated on Sat, Apr 8 2023 6:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment