60 శాతానికి మించి రాబడులు
2023–24లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా
న్యూఢిల్లీ: దలాల్ స్ట్రీట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023 –24)లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా కొనసాగింది. దేశంలో దృఢమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆకర్షణీయమైన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య స్థాయి షేర్లును కొనేందుకు ఆధిక ఆసక్తి చూపారు. 2023–24లో బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 62%, స్మాల్ క్యాప్ సూచీ 60% రాణించాయి. ఇదే కాలంలో బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 25% పెరిగింది.
‘‘ఆదాయాలు గణనీయంగా పెరగడం, అధిక వృద్ధి అవకాశాలతో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా షేర్లను కొనుగోలుకు ఆసక్తి చూపారు. లార్జ్ క్యాప్ షేర్ల పట్ల విముఖత చూపారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర పెట్టుబడులు పెరగడం ఇందుకు నిదర్శనం. ఆర్థిక విస్తరణ సమయంలో చిన్న, మధ్య తరహా షేర్ల వృద్ధి వేగంగా ఉంటుందనే సంప్రదాయ సూత్రాన్ని వారు విశ్వసించారు. అంతేకాకుండా స్మాల్, మిడ్ సైజ్ కంపెనీల అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు వారిని కొనుగోళ్ల వైపు ఆకర్షితం చేశాయి’’ అని హెడ్జ్ ఫండ్ హెడోనోవా సీఐఓ సుమన్ బెనర్జీ తెలిపారు.
► 2023–24లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫిబ్రవరి 8న 40,282 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. గతేడాది మార్చి 31న 23,881 వద్ద ఏడాది కనిష్టానికి తాకింది.
► ఇదే కాలంలో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ ఫిబ్రవరి 7న 46,821 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేయగా, గతేడాది మార్చి 31న 26,692 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.
► సెన్సెక్స్‌తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల అత్యుత్తమ ప్రదర్శన భారత ఈక్విటీ మార్కెట్ క్రియాశీలక స్వభావాన్ని, ఇన్వెస్టర్ల అపార వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతీ తెలిపారు.
► వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య తరహా షేర్ల ర్యాలీ కొనసాగుతుందని న్యాతీ అభిప్రాయపడ్డారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారాన్ని దక్కించుకోవచ్చనే అంచనాలతో వ్యాపార అనుకూల వాతావరణం పెంపొంది స్థిరమైన వృద్ధి కొనసాగొచ్చు. దీనికి తోడు భారత వృద్ధి బలమైన అవుట్‌లుక్ అంచనాలు ఈ రంగాల షేర్లకు డిమాండ్‌ను పెంచుతాయి’’ న్యాతీ తెలిపారు. అయితే కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ అనిశి్చతులు, లాభాల స్వీకరణ వంటి అంశాలు స్వల్పకాలిక ఒడిదుడుకులకు దారితీయొచ్చన్నారు.
ఐపీవో బాటలో ఆఫ్కన్స్ ఇన్‌ఫ్రా
ఆఫ్కన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లి క్‌ఇష్యూ బాట పట్టింది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఐపీవోతో రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనుంది.
రూ. వెయ్యి కోట్లకు జిరోధా ఫండ్ విలువ
జిరోధా, స్మాల్‌కేస్ జేవీ జిరోధా ఫండ్ హౌస్ నిర్వహణలోని ఆస్తుల విలువ కేవలం 40 రోజుల్లో రూ. 500 కోట్ల మేర ఎగిసింది. దీంతో సంస్థ ఏయూఎం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది.
Comments
Please login to add a commentAdd a comment