న్యూఢిల్లీ: దేశీ ఓటీటీ స్ట్రీమింగ్ పరిశ్రమ వచ్చే దశాబ్ద కాలంలో 22–25 శాతం మేర వార్షిక వృద్ధి సాధించనుంది. 13–15 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. మీడియా, వినోద రంగాలపై పరిశ్రమల సమాఖ్య సీఐఐ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అన్ని రకాల కంటెంట్ అందిస్తున్న దాదాపు 40 పైగా సంస్థలతో, తీవ్రమైన పోటీ ఉన్న వర్ధమాన దేశాల మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందని నివేదిక పేర్కొంది.
గత ఆరేళ్లుగా
చౌకగా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, గత ఆరేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడం మొదలైనవి డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులకు గణనీయంగా తోడ్పడుతున్నాయని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ వంటి అంతర్జాతీయ సంస్థలు అమెరికాతో పోలిస్తే భారత మార్కెట్‌లో మాత్రమే ప్రత్యేకంగా 70–90 శాతం తక్కువ రేట్లకు ఓటీటీలు అందిస్తుండటం మరో సానుకూలాంశమని వివరించింది. దేశీ ఒరిజినల్ కంటెంట్ రూపకల్పనలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌తో విదేశాల్లోని ప్రవాస భారతీయులకు కూడా భారతీయ ఓటీటీ సంస్థలు మరింత చేరువ కావడానికి ఆస్కారం ఉందని నివేదిక వివరించింది.
సబ్‌స్క్రిప్షన్స్ ఆదాయం
గత కొన్నాళ్లుగా ఏవీవోడీ (అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)తో పోలిస్తే ఎస్‌వీవోడీ (సబ్‌స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)కి డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇది ఏవీవోడీని కూడా అధిగమించగలదని తెలిపింది. దేశీయంగా ఆహా, ఆల్ట్ బాలాజీ, జీ5, ఎరోస్ నౌ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ప్లస్, సోనీలివ్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో ఉన్నాయి. నివేదిక ప్రకారం భారతీయ మీడియా, వినోద పరిశ్రమ తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి పుంజుకుంది. 2030 నాటికి 55–70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి.
చదవండి:ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..
Comments
Please login to add a commentAdd a comment