న్యూఢిల్లీ: బాద్‌షా మసాలాలో మెజారిటీ వాటా(51 శాతం) కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 588 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించేందుకు డాబర్‌కు వీలు చిక్కనుంది. డీల్ ప్రకారం రూ. 1,152 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో బాద్‌షా సొంతం చేసుకోనుంది.
మిగిలిన 49 శాతం వాటాను సైతం ఐదేళ్ల తదుపరి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆహార సంబంధ బిజినెస్‌ను మరింత విస్తరించే వ్యూహంలో భాగంగా బాద్‌షా కొనుగోలుకి తెరతీసినట్లు డాబర్ పేర్కొంది. వెరసి రూ. 25,000 కోట్ల విలువైన బ్రాండెడ్ మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించనుంది. దీంతో రానున్న మూడేళ్లలో ఫుడ్ బిజినెస్ ఆదా యాన్ని రూ. 500 కోట్లకు చేర్చే వీలున్నట్లు డాబర్ తెలియజేసింది. 1958లో ఏర్పాటైన బాద్‌షా మసాలా 2021–22లో రూ. 189 కోట్ల టర్నోవర్ సాధించింది.
రూ. 2.5 డివిడెండ్
ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) రెండో త్రైమాసికంలో డాబర్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 3 శాతం క్షీణించి రూ. 491 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో లాభం రూ. 505 కోట్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,986 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 2,818 కోట్ల టర్నోవర్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment