ఆదాయపు పన్ను శాఖ వారు లక్ష మందికి నోటీసులు పంపారు. సాక్షాత్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎవరికి పంపించారంటే..
ప్రధానంగా మూడు రకాల వారికి..
1. రిటర్నులు వేయని వారికి
2. ఆదాయం తక్కువ చూపించి రిటర్ను వేసిన వారికి
3.తప్పుడు సమాచారంతో రిటర్ను వేసిన వారికి
పైన పేర్కొన్న వారందరికీ లక్ష నోటీసులు ఇచ్చారు. ఈ లక్షలో మీరున్నారా అనే ప్రశ్నకు జవాబుగా ‘మాయాబజార్’లో శర్మ–శాస్త్రిలాగా తాన–తందానలాగా ‘మేమా..మేమేం చేశాం’ ని కుదుటపడకండి.
డిపార్ట్‌మెంట్ వారికున్న అధికారం ప్రకారం అవసరమైతే ఆరేళ్లు వెనక్కి వెళ్లి అసెస్‌మెంటుని ‘రీ–ఓపెన్’ చేయొచ్చు. ఇలా ఇప్పటికే 55,000 మంది విషయంలో అసెస్‌మెంట్ చేశారు. ఇప్పటికి 2023 మార్చి ఆఖరు నాటికి సంబంధించి అత్యధిక సంఖ్యలో రిటర్నులు వేసినప్పటికీ, వేసిన వాటిలో 70 శాతం రిటర్నులలో ట్యాక్సబుల్ ఇన్‌కం లేదు. ఏదో మొక్కుబడిగా వేసిన రిటర్నులు లేదా ‘ఈ సంవత్సరానికి అయిపోయింది’ అని చేతులు దులుపుకున్న బాపతు అన్నమాట.
ముందుగా, వాళ్లు సేకరించిన సమాచారాన్ని బట్టి రూ. 50,00,000 ఆదాయం ఉన్న వారికి ... ఇలా ఉన్న వారిలో వేయని వారు, తక్కువ చూపించిన వారు, తప్పుగా చూపించిన వారిని ఎంచుకున్నారు. ఇవి ఏదో యధాలాపంగా, అనాలోచితంగా ఇవ్వలేదని, పస ఉన్న కేసులేనని ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఘంటాపథంగా చెప్పారు. ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఇవి కాకుండా 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాని వేతన జీవులకు నోటీసులు పంపుతున్నారు.
ఇవి ఎటువంటివి అంటే..
1. ఇంటద్దె అలవెన్సు
2. లీవ్ ట్రావెల్ అలవెన్సు
3. ఇంటి రుణంపై వడ్డీ
4. మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు
5. సెక్షన్ 80 కింద చెల్లింపులు
6. పెట్టుబడులు
7. సేవింగ్స్
8. పిల్లల స్కూలు ఫీజులు
చాలా మంది ‘‘ఏమీ అడగరులే’’ అని దొంగ క్లెయిమ్‌లు చేస్తున్నారు. కొంత మంది దొంగ రశీదులు, బిల్లులు పెడుతున్నారు. కుటుంబ సభ్యుల మీద ఇల్లు ఉంటే అద్దె చెల్లించకుండా అద్దె చెల్లించినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. దయచేసి తప్పుగా/లేనిదాన్ని క్లెయిమ్ చేయకండి. అన్ని చెల్లింపులు బ్యాంకు ద్వారా చేయండి. ప్రతి దానికి కాగితం, డాక్యుమెంటు, రుజువులు, బిల్లులు, వోచర్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, బ్యాంకు సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలు.. ఇవన్నీ మూడో వ్యక్తి నుంచి.. అంటే ఎక్స్‌టర్నల్ నుండి పొందండి. దీన్నే ‘‘ఎవిడెన్స్’’ అంటారు. జాగ్రత్తపడండి. కోరి కొరివితో పెట్టుకోకండి.
Comments
Please login to add a commentAdd a comment