బెంగళూరు ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిత్యావసరాల ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో (Dunzo) భారీగా ఉద్యోగాల కోత విధించింది. రిలయన్స్ మద్దతు ఉన్న ఈ సంస్థ తమ వర్క్‌ఫోర్స్‌లో 75% మందిని తొలగించిందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రధాన సరఫరా, మార్కెట్‌ప్లేస్ టీమ్‌లలో ఇక మిగిలింది కేవలం 50 మంది ఉద్యోగులేనని నివేదిక తెలిపింది.
ఖర్చుల నియంత్రణ, పెరిగిపోతున్న అప్పులు, ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల బకాయిలు, విక్రేత చెల్లింపుల సమస్యలతో పాటు నగదు లభ్యతను పెంచుకోవడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఉద్యోగాల కోతకు పూనుకున్నట్లు తెలుస్తోంది. డంజో ఆగస్టు 31న ఉద్యోగాల కోత విధించినట్లు తొలగింపులకు సంబంధించిన ఆన్‌లైన్ ట్రాకర్ లేఆఫ్స్.ఫై (Layoffs.fyi) పేర్కొంది.
ఉద్యోగులకు ఈ-మెయిల్స్
తొలగింపుల గురించి తెలియజేస్తూ తమ ఉద్యోగులకు డంజో ఈ-మెయిల్స్ పంపింది. నివేదిక ప్రకారం.. అవసరమైన నిధులను పొందిన వెంటనే బాధిత సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు, సీవెరెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిలు చెల్లిస్తామని లేఖలో డంజో హామీ ఇచ్చింది. ఒకప్పుడు 775 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీ, ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కొంటూ కష్టపడుతోంది.
కొత్త ఇన్వెస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ,రుణాల మిశ్రమం ద్వారా 22-25 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు దాదాపు దగ్గరికి వచ్చినట్లు ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. డీల్ ముగింపు దశలో ఉందని, 10-15 రోజులలోపు బకాయిలను చెల్లించేస్తామని గత జూలై మధ్యలో ఉద్యోగులకు తెలియజేసింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment