Ericsson: Over half of Indian mobile users to be on 5G by 2028 - Sakshi
Sakshi News home page

భారత్‌లో 5జీ దూకుడు: కానీ ఎయిర్‌పోర్ట్స్‌లో నిలిపివేత!

Published Tue, Dec 6 2022 9:20 AM | Last Updated on Tue, Dec 6 2022 10:32 AM

Ericsson report says Over half of Indian mobile users to be on 5G by 2028 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ జోరు మీద ఉండనుంది. 2028 చివరి నాటికి మొత్తం మొబైల్‌ కనెక్షన్స్‌లో సగానికంటే ఎక్కువ వాటా 5జీ కైవసం చేసుకోనుందని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ వెల్లడించింది. ‘టెలికం చరిత్రలో అత్యధికంగా 2024లో 4జీ కనెక్షన్స్‌ 93 కోట్ల స్థాయికి చేరనున్నాయి. ఆ తర్వాత క్రమంగా 4జీ కస్టమర్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా డేటా సగటు వినియోగం నెలకు ప్రస్తుతం ఉన్న 25 జీబీ నుంచి 2028 నాటికి 54 జీబీకి పెరగనుంది.

2022 డిసెంబర్‌ చివరినాటికి 5జీ చందాదార్ల సంఖ్య 3.1 కోట్లను తాకుతుంది. ఆరేళ్లలో ఈ సంఖ్య 69 కోట్లకు చేరుతుంది. 2028 చివరినాటికి మొత్తం మొబైల్‌ చందాదార్లలో 5జీ కనెక్షన్ల వాటా 53 శాతానికి ఎగుస్తుంది. 4జీ చందాదార్లు 57 కోట్లకు పరిమితం అవుతారు. మొబైల్‌ వినియోగదార్లలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 77 శాతం నుంచి ఆరేళ్లలో 94 శాతం తాకనుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 2028 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య 500 కోట్లకు చేరనుంది. మొత్తం మొబైల్‌ చందాదా­ర్లు 840 కోట్ల నుంచి 920 కోట్లకు పెరగనున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా 79 శాతం మొబై­ల్‌ చందాదార్లు స్మార్ట్‌ఫోన్లను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 230 టెలికం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించాయి. 5జీలో 700లకుపైగా స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లు కొలువుదీరాయి’ అని నివేదిక వివరించింది.  (సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ)

ఎయిర్‌పోర్టుల్లో 5జీ సేవల నిలిపివేత
పౌర విమానయాన శాఖ అభ్యర్ధన మేరకు టెలికం శాఖ (డాట్‌) ఆంక్షలు విధించిన నేపథ్యంలో టెల్కోలు .. హై-ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఉండే 5జీ సర్వీసులను విమానాశ్రయాల లోపల, చుట్టుపక్కల నిలిపివేయాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏవియేషన్‌ శాఖ ఇచ్చిన బఫర్, భద్రతా జోన్‌ల వివరాల ఆధారంగా విమానాశ్రయాల్లో రన్‌వేకు రెండు చివర్లా 2.1 కిలోమీటర్ల దూరం వరకూ, రన్‌వే మధ్య గీత నుండి 910 మీటర్ల దూరం వరకూ 3.3-3.6 గిగాహెట్జ్‌ బ్యాండ్‌లో 5జీ బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయొద్దని టెల్కోలను డాట్‌ ఆదేశించింది. (GST డీక్రిమినైజేషన్‌పై  కీలక చర్చ, వారికి భారీ ఊరట!)

ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇది తాత్కాలికమేనని, అన్ని విమానాల అల్టీమీటర్ల ప్రమాణాలను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్దేశించాక సర్వీసులను పునరుద్ధరించవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. పాట్నా, బెంగళూరు తదితర కొన్ని విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ ఎయిర్‌టెల్‌ మాత్రమే 5జీ సర్వీసులను అందిస్తోంది. పైలట్లు నిర్దిష్ట ఎత్తులో విమానాలను నడిపేందుకు అల్టీమీటర్‌ పరికరం ఉపయోగపడుతుంది. దీని సిగ్నల్స్‌కు 5జీ సిగ్నల్స్‌ అంతరాయం కలిగించే పరిస్థితిని నివారించే విధంగా తమ 5జీ బేస్‌ స్టేషన్లను సరిచేసుకోవాలంటూ నవంబర్‌ 29న టెల్కోలకు డాట్‌ సూచించింది.   

ఇదీ చదవండి: ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement