హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2028 చివరి నాటికి మొబైల్ చందాదార్లలో దాదాపు 57 శాతం వాటా 5జీ కైవసం చేసుకోనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక వెల్లడించింది. ‘2022 డిసెంబర్ చివరినాటికి దేశంలో 5జీ చందాదార్లు ఒక కోటి ఉన్నట్టు అంచనా. భారత్‌లో 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారీ నెట్‌వర్క్ విస్తరణ జరుగుతోంది’ అని ఎరిక్సన్ నివేదిక వెల్లడించింది.
అంతర్జాతీయంగా 150 కోట్లు..
కొన్ని మార్కెట్లలో భౌగోళిక రాజకీయ సవాళ్లు, స్థూల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీలో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. 2023 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మొబైల్ చందాదార్లు 5జీ వేదికపైకి రానున్నారు. ఉత్తర అమెరికాలో 5జీ చందాదార్ల వృద్ధి గత అంచనాల కంటే బలంగా ఉంది. ఈ ప్రాంతంలో 2022 చివరి నాటికి 5జీ విస్తృతి 41 శాతం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు నెలవారీ అంతర్జాతీయ సగటు డేటా వినియోగం 20 జీబీ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment