ఈ క్యాలండర్ ఏడాది(2021)ని నిజానికి చిన్న షేర్ల నామ సంవత్సరంగా చెబుతున్నారు విశ్లేషకులు. 2021 జనవరి మొదలు ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 21 శాతం ర్యాలీ చేస్తే.. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 60 శాతం దూసుకెళ్లింది. ఇక సెకండరీ మార్కెట్లు సైతం దూకుడు ప్రదర్శించాయి. 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రావడం ద్వారా రూ. 1.19 లక్షల కోట్లను సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డుకాగా.. కొత్త ఏడాది(2022)లోనూ మార్కెట్లలో బుల్ జోరు కనిపించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ స్టాక్ మార్కెట్లలో చిన్న షేర్లు దూకుడు ప్రదర్శించాయి. భారీ లాభాలతో ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. మార్కెట్లు నిర్మాణాత్మక బుల్ ట్రెండ్‌లో ఉండటంతో ఈ స్పీడ్ మరో రెండేళ్లపాటు అంటే 2022, 2023లోనూ కనిపించే వీలున్నట్లు ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్ధ్ న్యాటి అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత బలపడవచ్చని అంచనా వేశారు. కాగా.. సమీప కాలంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల ఎదురయ్యే రిస్కులు, అంతర్జాతీయ సంకేతాలతో హెచ్చుతగ్గులకు ఆస్కారమున్నట్లు తెలియజేసింది. అయితే దీర్ఘకాలంలో సానుకూల ఆర్థిక గణాంకాలు, కంపెనీల పటిష్ట ఆర్జనలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని పేర్కొంది. దీర్ఘకాలిక లాభాలపై పన్ను, నియంత్రణా విధానాల్లో మార్పుల కారణంగా 2018–2020 మధ్య మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు గడ్డుకాలం ఎదురైనట్లు పార్ధ్ పేర్కొన్నారు. తదుపరి ఆర్థిక సంస్కరణలు తదితర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో చిన్న కంపెనీలు అధిక వృద్ధి బాట పట్టినట్లు వివరించారు.
బడా ప్రాఫిట్స్
కరోనా మహమ్మారి ఆందోళనలను పెడచెవిన పెడుతూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో ఈ ఏడాది జనవరి– అక్టోబర్ మధ్య సెన్సెక్స్ 50,000 పాయింట్ల మైలురాయి నుంచి చరిత్ర సృష్టిస్తూ 61,000 పాయింట్లకు ఎగసింది. ఇది 21 శాతం వృద్ధికాగా.. ప్రస్తుతం 58,000 పాయింట్ల స్థాయికి చేరింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ నెలాఖరుకల్లా 37 శాతం జంప్‌చేసింది. స్మాల్ క్యాప్ మరింత అధికంగా 60 శాతం పురోగమించింది. ప్రపంచ బ్యాంకుల నుంచి లిక్విడిటీ మద్దతు, అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల పంపిణీ వేగమందుకోవడం, ప్రోత్సాహక ఆర్థిక విధానాలు వంటి అంశాలు పలు మార్కెట్లకు అండనిచ్చాయి. వెరసి అక్టోబర్ 19కల్లా బీఎస్‌ఈ మిడ్ క్యాప్ 27,246 పాయింట్ల వద్ద, స్మాల్ క్యాప్ 30,417 వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్ 62,245 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్ నిఫ్టీ 18,600 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను అందుకున్నాయి. కోవిడ్–19 భయాలను అధిగమిస్తూ 2020లో మొదలైన ర్యాలీ 2021లోనూ కొనసాగడం విశేషం. నిజానికి 2020లో సెన్సెక్స్ 16 శాతం పుంజుకోగా.. సాŠమ్ల్, మిడ్ క్యాప్స్ 24 శాతం బలపడ్డాయి.
లాక్‌డౌన్‌లకు చెల్లు
2020 మార్చిలో కోవిడ్–19 కట్టడికి లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయన్న అంచనాలతో మార్కెట్లు ఒక్కసారిగా బేర్ గుప్పెట్లోకి చేరాయి. అయితే నెల రోజుల్లోనే ప్రపంచ బ్యాంకుల లిక్విడిటీ దన్నుతో బుల్స్ పట్టుసాధించినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా 2017లో దూకుడు చూపిన చిన్న, మధ్యతరహా కౌంటర్లు ఆపై కష్టకాలాన్ని ఎదుర్కొన్నట్లు పైపర్ సెరికా వ్యవస్థాపకుడు అభయ్ అగర్వాల్ తెలియజేశారు. దీంతో అధిక వృద్ధికి అవకాశమున్న చిన్న షేర్లు మార్కెట్లను మించిన క్యాచప్ ర్యాలీని అందుకున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది చివర్లో ఓవైపు విదేశీ ఇన్వెస్టర్లు బ్లూచిప్స్‌లో అమ్మకాలకు దిగినప్పటికీ దేశీ ఫండ్స్, సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూకట్టడం చిన్న షేర్లకు జోష్‌నిచ్చినట్లు వివరించారు. సాధారణంగా చిన్న షేర్లపట్ల స్థానిక ఇన్వెస్టర్లు ఆసక్తి చూపితే.. విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్స్‌పైనే దృష్టిపెడతారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఐపీవో స్పీడ్
ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు సైతం క్యూకట్టారు. దీంతో కొత్తతరం టెక్ కంపెనీలు జొమాటో, నైకా, పేటీఎమ్, పాలసీబజార్ తదితరాలు భారీస్థాయిలో నిధులను సమకూర్చుకుని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. వెరసి గత రెండు దశాబ్దాలలోనే 2021 ఐపీవోలకు అత్యుత్తమ ఏడాదిగా నిలిచింది. పలు ఐపీవోలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దేవయాని ఇంటర్నేషనల్, నజారా టెక్నాలజీస్, గో ఫ్యాషన్, రోలెక్స్ రింగ్స్ ఏకంగా 100 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
చదవండి: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది, యువత చూపంతా ఐపీవోలపైనే
Comments
Please login to add a commentAdd a comment