కోల్‌కతాల్లో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆఫీస్–కమ్–రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం పన్ను సంస్కరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పేర్కొన్నారు. పన్ను వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా డిజిటల్ మార్గంలో వాటి పరిష్కారం, అలాగే పటిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు కేంద్రం సాధించిన విజయాలని అన్నారు. పన్నుల విభాగం ‘టెర్రరిజం నుంచి ట్రాన్స్‌పరెన్సీ’కి మారినట్లు మోదీ అభివర్ణించారు. కోల్‌కతాల్లో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆఫీస్–కమ్–రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
► పన్ను చెల్లింపుదారు–వసూలుదారు మధ్య విశ్వాస రాహిత్యాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నించింది. పన్ను నిబంధనలు, నిర్వహణా వ్యవహారాలను సులభతరం చేసింది.
► కార్పొరేట్ పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి కేంద్రం తగ్గించింది. సత్వర వృద్ధి, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం సృష్టి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల కంపెనీలు ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతాయి. కొత్త తయారీ సంస్థలకు పన్నులు 15% వరకూ తగ్గించాలన్న నిర్ణయం స్వావలంబన దిశగా దేశాన్ని నడిపిస్తుంది.
► వివాదాస్పద పన్ను మొత్తం అధికంగా ఉంటేనే అప్పీల్స్‌కు వెళ్లాలన్న సూచనలను కేంద్రం చేస్తోంది. ఐటీఏటీ అలాగే సుప్రీంకోర్టుల్లో పన్నుల శాఖ అప్పీల్ ఫైల్ చేయడానికి కనీస వివాదాస్పద పన్ను మొత్తాలను వరుసగా రూ.50 లక్షలు, రూ.2 కోట్లకు పెంచుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
► డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును తొలగించింది.ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగాలన్నదే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ఇక రిఫండ్స్ సత్వరం జరిగేలా చూస్తోంది. కేవలం కొద్ది వారాల్లోనే రిఫండ్స్ జరుగుతున్నాయి. మొత్తం పన్నుల వ్యవస్థలో పారదర్శకత, సరళతను తీసుకువచ్చింది.
► గత ప్రభుత్వాల కాలంలో పన్నుల వ్యవస్థ అంటే భయంకలిగే పరిస్థితి ఉండేది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులూ వచ్చేవి. పన్ను చెల్లింపుదారుడు–వసూలు దారుడు మధ్య ‘దోపిడీదారు–దోపిడీకి గురయ్యేవాడు’ తరహా పరిస్థితిని తొలగించడానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెద్దగా ప్రయత్నం జరగలేదు. అయితే ఈ వ్యవస్థను మనం పూర్తిగా తొలగించగలిగాం. వ్యవస్థను పారదర్శకతలోకి నడిపించాము. ఇప్పుడు పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తోంది.
► నియమ నిబంధనలను సంస్కరించి సరళతరం చేయడంతోపాటు, సాంకేతికత వినియోగంలో ముందడుగు మంచి ఫలితాలను అందిస్తోంది.
► పన్ను పాలనా యంత్రాంగం ధోరణి పూర్తిగా పాదర్శకతలోకి మార్చాలన్న ప్రధాన ధ్యేయంతో కేంద్రం పనిచేస్తోంది.
► రూ.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు దిగువ మధ్య తరగతి యువతకు ఎంతో ప్రయోజనం కల్పిస్తోంది.
► కేంద్రం తీసుకున్న పలు పన్ను సంబంధ నిర్ణయాల వల్ల వ్యాపారాల నిర్వహణ సులభతరం అవుతోంది. పలు సంస్థలకు న్యాయపరమైన అవరోధాలు ఎదురుకావడం లేదు.
► పన్ను వసూళ్ల విషయంలో సామాన్యుడు ఎటువంటి వేధింపులకూ గురికాకూడదన్న విషయాన్ని పన్నుల అధికారులు గుర్తుంచుకోవాలి. అలాగే వసూలయిన పన్ను మొత్తాలు పూర్తిగా వినియోమవుతున్నాయన్న అభిప్రాయాన్ని పన్ను చెల్లింపుదారుడు కలిగి ఉండేలా చర్యలు ఉండాలి. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలు క్రోడీకరించిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. పన్ను చెల్లింపుదారుడు–వసూలు అధి కారి మధ్య పరస్పన విశ్వాసం, పారద్శకతను పెంపొందించడంలో ఇది కీలకం. సంపద సృష్టి కర్తలు ఎప్పుడూ గౌరవం పొందాల్సి ఉంటుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది. వారి సమస్యల పరిష్కారం ఆర్థిక పురోగతికీ దోహదపడుతుంది.
► ఇప్పుడు 99.75% ఆదాయప పన్ను రిటర్న్స్ అవరోధం లేకుండా ఆమోదం పొందుతున్నాయి. తన పన్ను చెల్లింపుదారులపట్ల ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. కేవలం 0.25% కేసుల్లో మాత్రమే పరిశీలన జరుగుతోంది.
► పలు పన్ను విభాగాల్లో క్లిష్టతను జీఎస్‌టీ తగ్గించింది. పలు రంగాల్లో పన్ను రేట్లను తగ్గించడానికి ఈ విధానం దోహదపడింది.
Comments
Please login to add a commentAdd a comment