‘డీప్‌ సీ మిషన్‌’ కలిగిన ఆరోదేశంగా భారత్‌ | India is set to become the 6th country to have its own deep sea mission | Sakshi
Sakshi News home page

‘డీప్‌ సీ మిషన్‌’ కలిగిన ఆరోదేశంగా భారత్‌

Published Mon, Jun 17 2024 10:00 AM | Last Updated on Mon, Jun 17 2024 10:56 AM

India is set to become the 6th country to have its own deep sea mission

ప్రపంచంలో ప్రత్యేకంగా ‘డీప్‌ సీ మిషన్‌’ కలిగిన ఆరోదేశంగా భారత్‌ అవతరిస్తుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. సముద్ర ఉత్పత్తులపై ఆధారపడిన ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేలా భారత్‌ స్థిరమైన బ్లూఎకానమీపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..‘కొత్త ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా డీప్‌ సీ మిషన్‌ను విస్తరించాలని భావిస్తోంది. భారత్‌కు సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉంది. జీవనోపాధి కోసం సముద్ర ఉత్పత్తులపై ఆధారపడేవారి ఆర్థికస్థితిగతులను మరింత మెరుగుపరచాలి. స్థిరమైన బ్లూఎనానమీని సాధించేలా కృషి చేయాలి. అందుకోసం సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సహకారం అందించాలి. డీప్‌ సీ మిషన్‌ కేవలం సముద్రంలోని ఖనిజాలు అన్వేషించడానికి మాత్రమే పరిమితం కాదు. సముద్రంలోని వైవిధ్యమైన వృక్ష, జంతుజాలాన్ని కనుగొనడానికి ఉపయోగపడాలి. సముద్రంలో 6,000 మీటర్ల లోతున డైవ్ చేయగల ‘మత్స్యయాన్ 6000’ అభివృద్ధి కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ) చేసిన కృషి అభినందనీయం. సముద్రం లోతుకువెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా, ఒత్తిడిని తట్టుకునేలా ఇస్రో సహకారంతో ‘టైటానియం హల్’ను అభివృద్ధి చేస్తున్నాం’ అని చెప్పారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, 72 గంటల పాటు నీటిలో మునిగిఉండేలా అభివృద్ధి చేస్తున్న సెల్ఫ్-ఫ్లోటేషన్ టెక్నాలజీ పురోగతిని ఆయన సమీక్షించారు. డీప్‌ సీ మిషన్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం

డీప్‌ సీ మిషన్‌

భారతదేశ సముద్రజలాల్లోని ఖనిజాలను కనుగొనేందుకు డీప్ సీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సిబ్బంది సహాయం లేకుండా సముద్రగర్భంలోకి వెళ్లి మాంగనీస్ , నికెల్, కోబాల్ట్, కాపర్, ఐరన్ హైడ్రాక్సైడ్ వంటి ఖనిజాలతో కూడిన పాలీమెటాలిక్ పార్టికల్స్‌ను అన్వేషించి వాటిని వెలికితీసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఖనిజాలను ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్‌ల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఖనిజాల పరిశోధనతోపాటు వైవిధ్యమైన సముద్ర వృక్ష, జీవజాతులపై పరిశోధనలు జరిగేలా ఈ డీప్‌ సీ మిషన్‌ను వినియోగించుకోవాలని తాజాగా మంత్రి సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement