మంగళూరు: కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 17.69 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉంది. శతాబ్ది సంవత్సరం కావడంతో రూ.1,75,000 కోట్ల టర్నోవర్‌పై అంచనాతో ఉన్నట్టు బ్యాంక్ సీఈవో, ఎండీ ఎంఎస్ మహాబలేశ్వర తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కర్ణాటక బ్యాంక్ శాఖల సిబ్బందితో మంగళూరులోని ప్రధాన కార్యాలయం నుంచి వర్చవల్‌గా ఆయన మాట్లాడారు.
2023–24 సంవత్సరానికి బ్యాంక్ ప్రణాళికలను వారితో పంచుకున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి టర్నోవర్ 7.63 శాతం వృద్ధితో రూ.1,48,694 కోట్లు (ప్రాథమిక వివరాల ప్రకారం) ఉందని, డిపాజిట్లు రూ.87,362 కోట్లుగా, అడ్వాన్స్‌లు (రుణాలు) రూ.61,326 కోట్లుగా ఉన్నట్టు వివరించారు. బ్యాంక్ కాసా రేషియో 32.97 శాతానికి చేరినట్టు తెలిపారు.
రుణాలు, ఆస్తుల పరంగా స్థిరమైన వృద్ధిని గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసినట్టు మహాబలేశ్వర చెప్పారు. ఆస్తుల, అప్పుల మెరుగైన నిర్వహణతోపాటు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని సమర్థంగా అధిగమించినట్టు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18తో కర్ణాటక బ్యాంక్ నూరవ సంవత్సరాలోకి అడుగు పెట్టడం గమనార్హం. గడిచిన సంవత్సరానికి కర్ణాటక బ్యాంక్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టు బ్యాంక్ ఈడీ శేఖర్ రావు తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో నిర్వహణ రేషియోలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment