వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని మార్కెట్ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపగల అమెరికన్ కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. మంగళవారం ప్రారంభంకానున్న పరపతి సమావేశాలు బుధవారం(29న) ముగియనున్నాయి. మరోవైపు జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు గురువారం(30న) ముగియనుంది. దేశీయంగా నేడు(25న) ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనుంది. ఈ అంశాల నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సంచరించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
ఫెడ్‌పై కన్ను
ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటా పాకిన కోవిడ్-19.. కొద్ది రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాలలో మరింత వేగంగా విస్తరిస్తోంది. 50 రాష్ట్రాలలో 42 రాష్ట్రాలు కరోనా వైరస్‌తో వణుకుతున్నాయి. దీంతో వాషింగ్టన్ ప్రభుత్వం మరో భారీ ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు ఇటీవల పెరిగాయి. జులైలో నిరుద్యోగిత పెరగడంతో ప్రజలకు ప్రత్యక్షంగా నగదు చెల్లించే పథకాన్ని సెనేట్ రిపబ్లికన్స్ ప్రతిపాదించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా మధ్య తాజాగా వివాదాలు చెలరేగిన విషయం విదితమే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఫెడ్ అంచనాలు స్టాక్, ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగలవని నిపుణులు చెబుతున్నారు.
రోలోవర్స్
జులై ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న కారణంగా ట్రేడర్లు ఆగస్ట్ సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్ చేసుకునే అవకాశముంది. దీనికితోడు పలు దిగ్గజాలు వచ్చే వారం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాల ప్రభావం షేరుపై సోమవారం(27న) ప్రతిఫలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బాటలో బ్లూచిప్ కంపెనీలు టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ 27న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇదే విధంగా అల్ట్రాటెక్ సిమెంట్ 28న, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీఎస్‌కే ఫార్మా, మారుతీ సుజుకీ 29న క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. ఇతర దిగ్గజాలలో ఆర్‌ఐఎల్, హెచ్‌ఢీఎఫ్‌సీ 30న, ఐవోసీ 31న ఫలితాలు తెలియజేయనున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు వెల్లడికానున్నాయి.
ఇతర అంశాలూ
ఫెడ్ పాలసీ, ఎఫ్‌అండ్‌వో గడువు ముగియడం, బ్లూచిప్స్ ఫలితాలకుతోడు.. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు తదితర పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని నిపుణులు వివరించారు. ఇటీవల కోవిడ్-19 కట్టడికి రూపొందుతున్న పలు కంపెనీల వ్యాక్సిన్ల పురోగతి వార్తలు సైతం మార్కెట్లను నడిపిస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment