న్యూఢిల్లీ: ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ సాధానాల (పీపీఐ) ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్‌చేంజ్ చార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై చార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది.
ఇదీ చదవండి: కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ చమురు ఉత్పత్తి
వాలెట్ల వంటి పీపీఐ సాధనాల ద్వారా రూ. 2,000కు మించి జరిపే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్‌చేంజ్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాపారవర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీనితో కస్టమర్లపై చార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్‌పీసీఐ తాజా వివరణ ఇచ్చింది.
మరోమాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి చెందిన వాలెట్ గల కస్టమరు మరో కంపెనీ వాలెట్ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్‌చేంజ్ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ చార్జీలు సహాయపడతాయి. ప్రస్తుతం మొబైల్ వాలెట్ పేమెంట్ మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపినా ఏ కస్టమరుకూ ఎటువంటి చార్జీలు ఉండవని పేటీఎం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment