దేశంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. అంతే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అడిషనల్ ఫ్యాకర్ట్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ప్రామాణీకరణను తొలగించడానికి ఆర్బీఐ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతానికి ఎటువంటి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయలేదు కానీ తమ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో దీన్ని ప్రస్తావించింది. డిజిటల్ పేమెంట్ లావాదేవీల ప్రామాణీకత కోసం మెరుగైన విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం మనం ఏదైన ఆర్థిక లావాదేవీని డిజిటల్‌గా నిర్వహించినప్పుడు ఆథెంటికేషన్ కోసం ఫిన్‌టెక్ సంస్థ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తేనే లావాదేవీని పూర్తి చేయడానికి వీలవుతుంది. బ్యాంక్ ఖాతాల భద్రతను నిర్ధారించడానికి, చట్టవిరుద్ధంగా పొందిన ఆర్థిక డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ అడిషనల్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ( AFA ) ఒక కీలక దశ.
ఆర్‌బీఐ నిర్దిష్ట ఏఎఫ్‌ఏని నిర్దేశించనప్పటికీ చెల్లింపుల వ్యవస్థ ఎక్కువగా ఎస్‌ఎంఎస్-ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని అనుసరిస్తోంది. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ప్రత్యామ్నాయ ప్రమాణీకరణ యంత్రాంగాలు వచ్చాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఇటువంటి యంత్రాంగాల వినియోగాన్ని పరిశీలించాలని ఆర్బీఐ సూత్ర ప్రాయ ప్రతిపాదనలు చేసింది.
ఇక ఇదే ప్రకటనలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS)కు సంబంధించిన ప్రతిపాదనలూ చేసింది. బ్యాంకులు అనుసరించాల్సిన AePS టచ్‌పాయింట్ నిర్వాహకుల కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలాగే మోసాలను నిరోధించే చర్యలను సైతం పరిగణననలోకి తీసుకోవాలని సూచించింది. గతేడాది ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 37 కోట్ల మంది లావాదేవీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment