Digital Payments: యాప్స్‌ నుంచి చెల్లిస్తున్నారు.. | Rise Of Digital Payments And UPI In India | Sakshi
Sakshi News home page

యాప్స్‌ నుంచి చెల్లిస్తున్నారు..

Published Tue, Jun 8 2021 3:01 AM | Last Updated on Tue, Jun 8 2021 8:06 AM

Rise Of Digital Payments And UPI In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం.. పేరు ఏదైనా ఇప్పుడు రియల్‌ టైం చెల్లింపుల కోసం వినియోగదార్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఒక పేమెంట్‌ యాప్‌ వాడుతున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత యాప్స్‌ వినియోగం దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా చెల్లింపులు, నగదు బదిలీ వంటి లావాదేవీలు క్షణాల్లో పూర్తి కావడం.. కచ్చితత్వం, అదనపు వ్యయాలు లేకపోవడం తదితర ప్రయోజనాలు ఉండడంతో వీటి పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరెన్సీకి ప్రత్యామ్నాయంగా యూపీఐ యాప్స్‌ నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో. 2020లో రియల్‌ టైమ్‌ లావాదేవీల పరిమాణం చైనాలో 1,500 కోట్లు దాటితే.. భారత్‌ ఏకంగా 2,500 కోట్లు నమోదైందంటే ఎంత వేగంగా కస్టమర్లు డిజిటల్‌ వైపు మళ్లుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్య విషయమేమంటే ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించే పనిలో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిమగ్నమైంది.  

ఇవీ యూపీఐ గణాంకాలు..
దేశంలో యాక్టివ్‌ యూపీఐ యూజర్లు సుమారు 20 కోట్లు ఉన్నారు. ఈ సంఖ్యను 2025 నాటికి 50 కోట్లకు చేర్చాలన్నది మొబైల్‌ పేమెంట్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా లక్ష్యం. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం యూపీఐ లావాదేవీల పరిమాణం, విలువ రెండేళ్లలో మూడింతలు దాటింది. 2019 మే నెలలో రూ.1,52,449 కోట్ల విలువైన 73.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో రూ.4,90,638 కోట్ల విలువైన 253.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం 49 పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, 175 బ్యాంకులు, 16 థర్డ్‌ పార్టీలకు చెందిన యూపీఐ ఆధారిత యాప్స్‌ భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో థర్డ్‌ పార్టీ యాప్స్‌దే హవా. పరిశ్రమలో వీటి వాటా ఏప్రిల్‌ గ ణాంకాల ప్రకారం ఫోన్‌పే 45%, గూగుల్‌ పే 34.3, పేటీఎం 12.14% వాటా దక్కించుకున్నాయి.  
సెకండ్‌ వేవ్‌ ప్రభావం..
యూపీఐ లావాదేవీల మీద సెకండ్‌ వేవ్‌ ప్రభావం పడింది. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పరిమాణం 4.14 శాతం తగ్గి 253.9 కోట్లు, విలువ 0.61% పడిపోయి రూ.4,90,638 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా రూ.5,04,886 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. పరిమాణం 273.2 కోట్లుంది. సున్నా లావాదేవీల నుంచి ఈ స్థాయికి అయిదేళ్లలో రావడం విశేషం. అయితే ప్రభుత్వం 2019 డిసెంబరులో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) తొలగిస్తూ లావాదేవీల ఫీజును లేకుండా చేయడంతో దేశంలో యూపీఐ యాప్స్‌ హవాకు దారి తీసింది. కాగా, ఎండీఆర్‌ ఎత్తివేయడం వల్ల పేమెంట్‌ గేట్‌వే సంస్థల మనుగడపై ప్రభావం చూపిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన కమిటీ గతేడాది జూలైలో అభిప్రాయపడింది. ఈ నిర్ణయం పరిశ్రమలో ఆవిష్కరణలకు అడ్డుగా నిలిచిందని, ఉద్యోగాలు కోల్పోతున్నారని, డిజిటల్‌ పేమెంట్స్‌ మౌలిక వసతుల విస్తరణ నెమ్మదించిందని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎండీఆర్‌ తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే యూపీఐ లావాదేవీలపై ఫీజును కస్టమర్లు చెల్లించాల్సి వస్తుంది.

బ్యాంకులకూ మేలు జరుగుతోంది..
డిజిటల్‌ లావాదేవీలను అన్ని బ్యాంకులూ ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. గతంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్యాంకు శాఖలు నెలకొని ఉండేవి. ప్రస్తుతం తదుపరి తరం శాఖలు 1,500 చదరపు అడుగుల లోపుకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకానొక దశలో ఏటా 80,000 మందిని నియమించుకున్నాయి. 2020లో ఈ సంఖ్య 5,113 మాత్రమేనని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తెలంగాణ కన్వీనర్‌ బి.ఎస్‌.రాంబాబు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా 80,000 పైచిలుకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలు నేడు 63,000లకు వచ్చి చేరాయని వెల్లడించారు. శాఖల విస్తరణ క్రమంగా తగ్గుతోందని, యూపీఐ యాప్స్‌ కారణంగా బ్యాంకులకూ మేలు జరుగుతోందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement