ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా లక్ష్యం
సామర్థ్యాల పెంపుపై రూ. 5 వేల కోట్ల పెట్టుబడి
ముంబై: చైనాకు చెందిన ఎస్‌ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు ఓ కొత్త కారును ఆవిష్కరించాలని భావిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఎస్‌ఏఐసీతో భాగస్వామ్యం ఖరారు చేసుకోవడాన్ని ప్రకటించిన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలు తెలిపారు.
మరోవైపు, హలోల్‌లో (గుజరాత్) ఇప్పుడు తమకున్న ప్లాంటుకు దగ్గర్లోనే మరో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా గౌరవ చైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1 లక్ష యూనిట్ల నుంచి 3 లక్షలకు పెరుగుతుందన్నారు. సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై భాగస్వాములు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మారుతీ తరహా విప్లవం..
కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల (ఎన్‌ఈవీ) విభాగంలో ఈ జేవీ ’మారుతీ తరహా విప్లవాన్ని’ తేగలదని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ‘నలబై ఏళ్ల క్రితం మారుతీ మార్కెట్లోకి వచి్చన తర్వాత ఆటో పరిశ్రమను మార్చేసింది. సమర్ధమంతమైన, తేలికైన, అధునాతనమైన కార్లను ప్రవేశపెట్టి ఇప్పుడు మార్కెట్ లీడరుగా ఎదిగింది. అంబాసిడర్లు, ఫియట్లు కనుమరుగయ్యాయి. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల విభాగంలో ఎంజీ కూడా ఆ ఫీట్‌ను పునరావృతం చేయగలదని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలతో ఎన్‌ఈవీ విభాగంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు జిందాల్ వివరించారు.
ఎంజీ మోటర్ మాతృ సంస్థ అయిన ఎస్‌ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గతేడాది నవంబర్‌లో జేవీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త స్వరూపం ప్రకారం జేవీలో జేఎస్‌డబ్ల్యూకి 35 శాతం, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలకు 8 శాతం, ఎంజీ మోటార్ డీలర్లకు 3 శాతం, ఉద్యోగులకు 5 శాతం, మిగతా 49 శాతం వాటాలు ఎస్‌ఏఐసీకి ఉంటాయి. కాగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ – ఎస్‌ఏఐసీ మోటార్ జాయింట్ వెంచర్ క్రింద అభివృద్ధి చేసిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ జరిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్, ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment