బైజూస్‌ వ్యవస్థాపకులకు షాక్‌! | Shareholders who want to avoid ownership of Byjus | Sakshi
Sakshi News home page

బైజూస్‌ వ్యవస్థాపకులకు షాక్‌!

Published Tue, Feb 6 2024 5:09 AM | Last Updated on Tue, Feb 6 2024 10:22 AM

Shareholders who want to avoid ownership of Byjus - Sakshi

న్యూఢిల్లీ: థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నుంచి వ్యవస్థాపకులకు ఉద్వాసన పలకాలని ఆరు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. బైజూస్‌ బ్రాండ్‌తో ఎడ్యుకేషన్‌ సేవలందించే కంపెనీని వ్యవస్థాపకుల నియంత్రణ నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం వాటాదారుల అసాధారణ సమావేశాన్ని (ఈజీఎం) ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలియజేశాయి.

డచ్‌ సంస్థ ప్రోజస్‌ అధ్యక్షతన బైజూస్‌లో పెట్టుబడులున్న కంపెనీలు ఏజీఎంకు నోటీసు జారీ చేసినట్లు తెలియజేశాయి. పాలన (గవర్నెన్స్‌), నిబంధనల అమలు అంశాలు, ఆర్థిక నిర్వహణలో అక్రమాలు, డైరెక్టర్ల బోర్డు పునరి్నర్మాణం తదితరాల పరిష్కారం కోసం ఏజీఎంకు పిలుపునిచి్చనట్లు వెల్లడించాయి. వెరసి యాజమాన్య మార్పునకు డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

నోటీసు జారీకి మద్దతిచి్చన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలలో జనరల్‌ అట్లాంటిక్, పీక్‌ ఫిఫ్టీన్, సోఫినా, చాన్‌ జుకర్‌బర్గ్, ఔల్‌ అండ్‌ శాండ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి బైజూస్‌లో ఉమ్మడిగా సుమారు 30 శాతం వాటా ఉంది. బైజూస్‌ వాటాదారుల కన్సార్షియం ఇంతక్రితం జులై, డిసెంబర్‌లలోనూ డైరెక్టర్ల బోర్డు సమావేశానికి పిలుపునిచి్చనప్పటికీ ఆచరణకు నోచుకోలేదని తాజా నోటీసులో ప్రోజస్‌ పేర్కొంది. కాగా.. ఈ అంశంపై బైజూస్‌ వెంటనే స్పందించకపోవడం గమనార్హం!

200 మిలియన్‌ డాలర్ల సమీకరణ..
ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ తాజాగా ఈక్విటీ రైట్స్‌ ఇష్యూ ద్వారా 200 మిలియన్‌ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉంది. కంపెనీ వాస్తవ వేల్యుయేషన్‌ మరింత ఎక్కువే అయినప్పటికీ ప్రస్తుత విడత సమీకరణ కోసం మాత్రం 220–250 మిలియన్‌ డాలర్ల శ్రేణిలో పరిగణించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంత తక్కువ వేల్యుయేషన్‌ ఈ ఇష్యూకు మాత్రమే పరిమితం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మాతృసంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎల్‌పీఎల్‌) ఈ మేరకు ఈక్విటీ షేర్‌హోల్డర్లకు రైట్స్‌ ఇష్యూను ప్రారంభించినట్లు బైజూస్‌ పేర్కొంది. 2022 మార్చిలో బైజూస్‌ ఏకంగా 22 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో నిధులు సమీకరించింది. పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్‌ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు బైజూస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 18 నెలలుగా వ్యవస్థాపకులు దాదాపు 1.1 బిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయడమనేది సంస్థ పట్ల వారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది.

మరోవైపు, ఇటీవలి కాలంలో సంస్థ ఎదుర్కొన్న సవాళ్లు, బైజూస్‌ లక్ష్యం, రైట్స్‌ ఇష్యూ తదితర అంశాలను వివరిస్తూ షేర్‌హోల్డర్లకు కంపెనీ లేఖ రాసింది. దాదాపు 22 నెలల జాప్యం తర్వాత బైజూస్‌ ఇటీవలే ప్రకటించిన 2022 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాల ప్రకారం నిర్వహణ నష్టం రూ. 6,679 కోట్లకు, ఆదాయం రూ. 5,298 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నష్టం రూ. 4,143 కోట్లు, కాగా ఆదాయం రూ. 2,428 కోట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement