విలేకరుల సమావేశంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఈవీసీ రేవార్కర్, ఎండీ చక్రవర్తి, జేఎండీ శ్రీనివాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు, స్వయం ఉపాధి పొందుతున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు. కొత్తగా సప్లై చెయిన్ ఫైనాన్సింగ్, విద్యా రుణాల విభాగాల్లోకి కూడా మరికొద్ది నెలల్లో ప్రవేశించనున్నట్లు చక్రవర్తి వివరించారు.
రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 15% పైచిలుకు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18% వరకు వ్యాపార వృద్ధిని అంచనా వేస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) రూ. 1,71,000 కోట్లుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 33,000 కోట్లుగా ఉందని చక్రవర్తి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.3,000 కోట్ల డిపాజిట్లు, 46,000 పైచిలుకు డిపాజిట్‌దారులు, 10,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.
అన్ని శాఖల్లో అన్ని సర్వీసులు ..
ప్రస్తుతం 268 శాఖల్లో మాత్రమే వాణిజ్య వాహన (సీవీ) రుణాలు ఇస్తుండగా, కొత్తగా మరో 170 శాఖల్లో కూడా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 2023 ఆఖరు నాటికి అన్ని శాఖల్లోనూ అన్ని ఉత్పత్తులను అందించాలని నిర్దేశించుకున్నట్లు చక్రవర్తి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment