పుంజుకున్న స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు | Smartphone sales 10 percent growth september quarter | Sakshi
Sakshi News home page

పుంజుకున్న స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు

Oct 10 2020 6:04 AM | Updated on Oct 10 2020 6:04 AM

Smartphone sales 10 percent growth september quarter - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 కారణంగా సెంటిమెంట్‌ పడిపోవడం, లాక్‌డౌన్‌తో తిరోగమనం చవిచూసిన స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు తిరిగి గాడినపడ్డాయి. గతేడాదితో పోలిస్తే సెప్టెంబరులో ఆఫ్‌లైన్‌లో 10 శాతం వృద్ధి నమోదైందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ధర వ్యత్యాసం లేకపోవడంతో ఆన్‌లైన్‌ కస్టమర్లు కొంత ఆఫ్‌లైన్‌కు మళ్లడం.. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ చైన్లు గంటల వ్యవధిలోనే ఫోన్లను డెలివరీ చేస్తుండడమే ఈ వృద్ధికి కారణమని అవి అంటున్నాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా 51 శాతం తగ్గి 1.8 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. జూలై నుంచి సేల్స్‌ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులకు మళ్లడం కూడా స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో కదలికకు కారణమైంది.  

పెరిగిన సగటు ధర..
ఈ ఏడాది మార్చి దాకా స్మార్ట్‌ఫోన్‌ సగటు విక్రయ ధర రూ.13–14 వేల మధ్య నమోదైంది. కోవిడ్‌ ప్రభావంతో ఏప్రిల్‌–ఆగస్టులో ఇది రూ.10–11 వేలకు దిగొచ్చింది. సెప్టెంబరులో పుంజుకుని రూ.13 వేలకు చేరిందని బిగ్‌–సి మొబైల్స్‌ ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. ‘గతంతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ల టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఎక్స్‌పీరియెన్స్‌ విషయంలో వినూత్న ఫీచర్లతో కొత్త మోడళ్లు వచ్చి చేరుతున్నాయి. అయితే ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. కస్టమర్లకు డబ్బుకు తగ్గ విలువ చేకూరుతోంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా వినియోగదార్లకే ప్రయోజనం’ అని అన్నారు. కోవిడ్‌ దెబ్బకు జీరో డౌన్‌పేమెంట్‌ పథకాలను నిలిపివేసిన కంపెనీలు ఈ విధానాన్ని ఇటీవల తిరిగి మొదలుపెట్టాయి. అలాగే రూ.10 వేలలోపు ధరగల మోడళ్లకు డిమాండ్‌ అధికం కావడంతో అమ్మకాలు పెరిగాయని టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌  తెలిపారు.

మార్జిన్లు తగ్గించిన కంపెనీలు..
భారత్‌లో 2011–12 కాలంలో 165 బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్ల రంగంలో పోటీపడ్డాయి. ప్రస్తుతం శామ్‌సంగ్, వివో, ఓపో, షావొమీ, రియల్‌మీ మధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ బ్రాండ్ల సగటు విక్రయ ధర రూ.13–15 వేల మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీమియం సెగ్మెంట్‌ను యాపిల్, వన్‌ ప్లస్‌ కైవసం చేసుకున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్ల విక్రయాలపై విక్రేతలకు ఇచ్చే లాభాలను (మార్జిన్‌) ఇటీవల కంపెనీలు 5 శాతం దాకా తగ్గించాయి. మరోవైపు డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై కేంద్రం 10 శాతం దిగుమతి సుంకం విధించింది. సుంకాల ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు 3 శాతం దాకా అధికమయ్యే ఛాన్స్‌ ఉందని సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ వై.గురు వెల్లడించారు. మొబైల్స్‌పై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి చేర్చడం వల్ల గ్రే మార్కెట్‌ పెరుగుతోందన్నారు.

హాట్‌కేక్‌లా ఫోల్డ్‌–2..
ఆసక్తికర విషయం ఏమంటే శామ్‌సంగ్‌ రూ.1,49,999 ధరలో ఇటీవల ప్రవేశపెట్టిన సూపర్‌ ప్రీమియం మోడల్‌ ఫోల్డ్‌–2 హాట్‌కేక్‌లా అమ్ముడైంది. విడుదలైన 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 10,000 యూనిట్లకుపైగా కస్టమర్ల చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం. ఇందులో 500 యూనిట్ల దాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముడయ్యాయి. కాగా, 2జీ నుంచి 4జీకి కస్టమర్లు ఇటీవల వేగంగా మారారని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు. యాక్సెసరీస్‌కు ఏమాత్రం డిమాండ్‌ తగ్గలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement